Share News

VP Candidate Sudarshan Reddy: అందరివాడిని

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:46 AM

ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ...

VP Candidate Sudarshan Reddy: అందరివాడిని

  • ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదు.. ఉప రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం

  • దేశంలో 64 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతునిస్తున్నాయి

  • అర్హుడినే ఎన్నుకోవాలని ఎన్డీఏనూ కోరుతున్నా

  • రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నిర్వర్తించా

  • కొత్త ఓటర్లను చేర్చుకోవాల్సిన ఎన్నికల కమిషన్‌

  • ప్రస్తుతం ఉన్న ఓటర్లను తొలగిస్తోంది

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. గతంలో వెంకయ్యనాయుడు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాతే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేశారని గుర్తు చేశారు. తాను ఏ పార్టీ వాడినీ కాదని, రాజ్యాంగంతో సుదీర్ఘమైన ప్రస్థానం ఉన్న తనకు అన్ని పార్టీలు మద్దతిస్తాయన్న ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. గతంలో బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ కూడా తనను లోకాయుక్తగా నియమించారని గుర్తు చేశారు. అర్హులైన వ్యక్తిని ఎంచుకోవాలని ఎన్డీఏ పార్టీలను కూడా కోరుతున్నట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తిగా ఐదున్నర దశాబ్దాలు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాఽధ్యతనే నిర్వర్తించానని, ఇప్పుడు కూడా అదే బాఽధ్యత స్వీకరించేందుకు ముందుకొచ్చానని చెప్పారు. రాజ్యాంగమంటేనే సామాజిక న్యాయమని, రాజ్యాంగ పీఠికలో తొలి పదం సామాజిక న్యాయమని పేర్కొన్నారని చెప్పారు. ఈ మేరకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధితో మాట్లాడారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అన్న పదాలతో సరిపెట్టకుండా.. అన్ని వర్గాలను కలుపుకొనిపోయే ‘సౌహార్ద్ర భావం’ అన్న పదం చేర్చారంటే రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో అర్థమవుతుందన్నారు. ‘‘ప్రస్తుత తరుణంలో దేశంలో రాజ్యాంగం పూర్తిగా విధ్వంసం అయిందని చెప్పలేను కానీ, రాజ్యాంగ విలువలు మాత్రం దాదాపు పతనమయ్యాయని చెప్పగలను. ఎన్నికల కమిషన్‌ సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ కుప్పకూలిపోతున్నాయి. వాటిని పరిరక్షించాలంటే రాజ్యాంగ విలువల పట్ల పూర్తి నిబద్ధత, అవగాహన ఉన్న సరైన వ్యక్తులను వ్యవస్థల్లో నియమించాలి. వారిని నిర్ణయ క్రమంలో చేర్చాలి’’ అని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగం కుప్పకూలిపోతే సంపన్నులకు, మధ్యతరగతికి జరిగే నష్టం తక్కువైనా.. అణగారిన వర్గాలు పూర్తిగా సాధికారత కోల్పోతాయని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నవారే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు.


GCN.jpg

ఒప్పించే బాధ్యతను రేవంత్‌రెడ్డిపై పెట్టారు..

ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై తనతో తొలుత కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ముుఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌చేసి 15 నిమిషాల్లో వస్తున్నానని చెప్పి ఆగమేఘాలపై వచ్చారని చెప్పారు. ‘‘మిమ్మల్ని ఒప్పించే బాధ్యతను నాపై పెట్టారు అని రేవంత్‌ అన్నారు. చివరగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంప్రదించారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాత్రం నేను పోటీ చేయనని అందరికీ చెప్పాను. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తుందని, అనేక ఇతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని చెప్పినందుకే పోటీ చేసేందుకు ఒప్పుకొన్నాను. మిమ్మల్ని ఉపరాష్ట్రపతి పదవికి ఎంచుకోవడం మాకు గౌరవాన్ని కల్పించింది అని యుపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు’’ అని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి వివరించారు. దేశంలో 64 శాతం మంది ప్రజలకు ప్రాతినిఽఽధ్యం వహించే పార్టీలు తనను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించాయని అన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌తోపాటు అన్ని పార్టీల నేతలు తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. గెలుపోటములనేది ప్రశ్నే కాదని, ఉపరాష్ట్రపతి పదవికి జరిగే పోటీని సైద్ధాంతిక సమరంగా భావిస్తున్నామని ఖర్గే చెప్పినట్లు తెలిపారు.

అన్ని పార్టీల పట్ల సమాన దృక్పథం

రాజకీయ పార్టీల పట్ల సమాన దృక్పథంతో వ్యవహరిస్తూ సభను సజావుగా నడపాలన్నదే తన ధ్యేయమని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తనకు సత్సంబంధాలున్నాయని, వారు విజ్ఞులు, దూరదృష్టి గలవారని, సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నవారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాకు సంబధించి ఎన్నికల కమిషన్‌ వివాదంలో ఇరుక్కోవడం గురించి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాకముందే దేశంలో ఓటర్ల జాబితాను తయారు చేశారని, ఆ బాధ్యతను రాజ్యాంగ సలహాదారైన బీఎన్‌ రావుకు అప్పజెప్పారని తెలిపారు. ప్రస్తుతం జాబితాలో ఉన్నవారిని తొలగిస్తున్నారని, బీఎన్‌ రావు మాత్రం శరణార్థులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. 1928లో అన్ని పార్టీల సదస్సులోనే పేద, ధనిక, వర్గ తారతమ్యాలు లేకుండా అక్షరాస్యతతో నిమిత్రం లేకుండా సార్వత్రిక వయోజన ఓటింగ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారని, ఈ మేరకు నెహ్రూ నివేదిక సమర్పించారని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అంతకన్నా పదేళ్ల ముందే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సౌత్‌బరో కమిటీ ముందు దళితులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించాలని కోరారని వివరించారు. గాంధీజీ కూడా సార్వత్రిక వయోజన ఓటింగ్‌ను సమర్థించారని, ఈ విషయంలో గాంధీ, అంబేడ్కర్‌ ఏకీభావం వ్యక్తం చేశారని తెలిపారు. దేశ తొలి ఎన్నికల కమిషనర్‌ సుకోమల్‌ సేన్‌ కూడా నెహ్రూ కోరినా ఎన్నికలు జరిపేందుకు ఏడాదిపాటు సమయం తీసుకున్నారని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు శ్రమించారని వివరించారు ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఎన్నికల కమిషన్‌.. ఇప్పుడు రాజకీయ వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 21 , 2025 | 03:46 AM