Major terror plot foiled: భారీ ఉగ్ర కుట్ర భగ్నం
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:56 AM
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఉగ్ర దాడులకు పన్నిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు భగ్నం చేశారు...
ముగ్గురిని అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్
ఒకరు హైదరాబాద్ డాక్టర్, ఇద్దరు యూపీ వాసులు
ఆయుధాలు, రసాయనాల స్వాధీనం
పలు నగరాల్లో ఉగ్రదాడులకు కుట్ర
ఢిల్లీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ల్లో రెక్కీ
హైదరాబాద్/ సిటీ, రాజేంద్రనగర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఉగ్ర దాడులకు పన్నిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి ఆదివారం విలేకరులకు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రమాదకర రసాయనాలు, ఆధునిక ఆయుధాలతో భారీ ఉగ్రదాడికి కుట్ర చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్(35), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహెయల్ మహమ్మద్ సలీమ్‌లను అరెస్టు చేశారు. మొహియుద్దీన్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ నెల 7న రెండు గ్లోక్ పిస్టళ్లు, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కారి్ట్రడ్జ్‌లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్, రిసిన్ తయారీకి వాడే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. విచారణలో తాను గాంధీనగర్ జిల్లాలో మారుమూల ఉన్న కలాల్ ప్రాంతంలో ఈ ఆయుధాలను అందుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఉగ్ర కార్యకలాపాలు చేపట్టేందుకే వీటిని సేకరిస్తున్నట్లు తెలిపాడు. ఆన్‌లైన్‌లో కన్సల్టెంట్ డాక్టర్‌గా పనిచేసే క్రమంలో ఉగ్రవాదులతో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఐఎ్‌సకేపీ(ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్)కు చెందిన అబూ ఖదీజా(ఆఫ్ఘనిస్థాన్) ఇతడితో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు. ఖదీజాకు పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. చైనాలో వైద్యవిద్య చదివిన మొహియుద్దీన్ దేశంలో భారీ ఉగ్రదాడులు జరిపేందుకు అత్యంత విషపూరితమైన రిసిన్‌ను తయారుచేసే పనిలో ఉన్నట్లు గుజరాత్ ఏటీఎస్ డీఐజీ చెప్పారు. అతడి ఫోన్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా అతడికి ఆయుధాలు అందించిన యూపీకి చెందిన అజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహెయల్ మహమ్మద్ సలీమ్‌లను గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సేకరించిన ఆయుధాలను వీరు మొహియుద్దీన్‌కు అందించారు. పాకిస్థాన్‌లోని వీరి హ్యాండ్లర్ డ్రోన్ ద్వారా ఆ ఆయుధాలను పంపాడని డీఐజీ వెల్లడించారు. కాగా వీరు ఉగ్రదాడులు జరిపేందుకు లఖ్‌నవూ, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని పలు రద్దీ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మొహియుద్దీన్ అరెస్టుతో నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ ఫోర్ట్‌వ్యూ కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఇతడు నివాసం ఉంటున్నది ఈ కాలనీలోనే. ఉప్పర్‌పల్లి ఫోర్ట్‌వ్యూ కాలనీ రోడ్డు నెంబరు 9లోని ఆషాద్ మంజిల్ మొదటి అంతస్తులో ఇతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.
ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా హైదరాబాద్‌కు లింకులు
దేశంలో ఎక్కడ ఎప్పుడు ఉగ్ర కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా.. ఎక్కడ ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్టయినా హైదరాబాద్ నగరంతో వారికి ఏదో ఒక లింకు ఉంటోంది. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు ఒక షెల్టర్ జోన్‌గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతేడాది సెప్టెంబరులో ఐఎ్‌స(ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థకు చెందిన యువకుడు రిజ్వాన్ అలీ నగరానికి వచ్చి ఆశ్రయం పొంది తలదాచుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఇతడు సైదాబాద్‌లోని శంకేశ్వర బజార్‌లో సుమారు ఆరు నెలలపాటు తలదాచుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తేలింది.
గతేడాది నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక సదస్సు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో జరిగినా.. పోలీసు నిఘా వ్యవస్థ కనిపెట్టలేక పోయిందనే చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సహా.. వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇస్లామిక్ సానుభూతిపరులు హోటల్లో దిగి నెల రోజులపాటు మత విద్వేష సదస్సును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించారంటే.. నగరాన్ని వారు ఎంత సేఫ్టీ జోన్‌గా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సదస్సుకు హాజరైన ఓ యువకుడు ముత్యాలమ్మ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేశాడు.