SCO Summit: హాయ్! నేను షియావో!
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:14 AM
చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో హ్యూమనాయిడ్ రోబోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సర్వీ్‌సడెస్క్, ప్రెస్ సెంటర్‌లో ఉన్న షియావో హీ అనే రోబో విలేకర్లకు సహాయకారిగా మసలుకుంటోంది.
ఎస్‌సీవో సదస్సులో అత్యాధునిక ఏఐ హ్యుమనాయిడ్ రోబో సేవలు
ఇంటర్వ్యూ చేసిన ఏఎన్‌ఐ వార్తాసంస్థ
భావోద్వేగాలను గుర్తించే అల్గారిథమ్స్
తక్షణ సమాచారం ఇచ్చే డేటాబే్‌సలు
సాంస్కృతిక తటస్థత, కచ్చితమైన సమాచారం, పనితీరులో మెరుగుదల.. ఇవే నా ప్రమాణాలు: షియావో హీ
బీజింగ్, ఆగస్టు 30: చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో హ్యూమనాయిడ్ రోబోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సర్వీ్‌సడెస్క్, ప్రెస్ సెంటర్‌లో ఉన్న షియావో హీ అనే రోబో విలేకర్లకు సహాయకారిగా మసలుకుంటోంది. అచ్చం ఒక యువతిలా కనిపించే ఈ రోబో.. జర్నలిస్టులు ఎదురుపడగానే చిరునవ్వుతో పలకరించి, అభివాదం చేస్తుంది. సదస్సుకు స్వాగతం పలుకుతుంది. తెలివితేటలు, భావోద్వేగాలు కలిగి ఉండటం ఈ రోబో విశిష్టత. ఏఎన్‌ఐ అనే వార్తాసంస్థ షియావోను ఇంటర్వ్యూ కూడా చేయటం విశేషం. ‘టియాన్‌జిన్ నగరంలో నిర్వహిస్తున్న ఎస్‌సీఓ సదస్సు కోసం అత్యాధునిక కృత్రిమమేధ పరిజ్ఞానంతో నన్ను తయారుచేశారు.
అడిగిన వెంటనే సమాచారం ఇవ్వటం, చైనీస్, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో సేవలందించటం వంటి పనుల్ని నేను చేయగలను’ అని షియావో తెలిపింది. తనలో భావోద్వేగాలను గుర్తించే అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్, అడాప్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఉన్నాయని పేర్కొంది. అంతర్జాతీయ ప్రతినిధులు, విలేకర్లు, సదస్సు నిర్వాహకుల మధ్య నిరంతర సమన్వయానికి అవసరమైన సమగ్ర నాలెడ్జ్ డేటాబే్‌సలను తనలో నిక్షిప్తం చేశారని, వాటి సాయంతోనే తాను సేవలు అందించగలుగుతున్నానని వెల్లడించింది. ఎస్‌సీఓ సదస్సులో షియావో మాత్రమేగాక ఇతర రోబోలు కూడా సేవలందిస్తున్నాయి. సదస్సు ప్రతినిధులకు ఐస్‌క్రీం అందించటానికి కూడా ఓ రోబో ఉండటం విశేషం.