Air India; విమాన ప్రమాదం.. సీనియర్ పైలట్‌దే తప్పా?
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:14 AM
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉందా? ఆ విమాన సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ ఉద్దేశపూర్వకంగా ఇంధన నియంత్రణ మీటను ఆపారా
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం.. ఖండించిన పైలట్ సంఘాలు
న్యూఢిల్లీ, జూలై 17: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉందా? ఆ విమాన సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ ఉద్దేశపూర్వకంగా ఇంధన నియంత్రణ మీటను ఆపారా? ఈ ప్రశ్నలకు అవునని బదులిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బ్లాక్‌బాక్స్ వాయిస్ రికార్డింగ్‌లో కూడా తోటి పైలట్(ఫస్ట్ ఆఫీసర్) సుమిత్‌ను ‘ఇంధనాన్ని ఎందుకు ఆపేశావు?’ అని అడిగినట్లు ఆ కథనం పేర్కొంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. బ్లాక్‌బాక్స్ రికార్డు ప్రకారం.. ఇంజన్లకు ఇంధనాన్ని నిలిపివేయడం ఉద్దేశపూర్వకమేనని పేర్కొంది.
రామ్ ఎయిర్ టర్బైన్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా ఇదే విషయాన్ని చెబుతోందని వెల్లడించింది. అమెరికాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ అధికారుల మూల్యాంకనం ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు తెలిపింది. అయితే.. భారత ప్రభుత్వం, పైలట్ సంఘాలు ఈ కథనాన్ని ఖండిస్తున్నాయి. దీనిపై ఇంకా అధ్యయనం జరగాల్సి ఉందని స్పష్టంచేశాయి. కాగా.. విమాన ప్రమాదంపై తుది నివేదిక ఇచ్చేవరకు ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ మీడియాకు గురువారం సూచించింది.