Road Accidents: రోడ్డు ప్రమాదాలకు ఇకపై కాంట్రాక్టర్‌కు జరిమానా
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:03 AM
రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీవోటీ...
‘బీవోటీ’ హైవేల పరిధిలో ఏడాదిలో
ఒకటి కంటే ఎక్కువ జరిగితే 25 లక్షలు
తర్వాతి ఏడాదీ పునరావృతమైతే 50 లక్షలు
కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబరు 2: రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీవోటీ (నిర్మాణం-నిర్వహణ-బదిలీ) పద్ధతిలో నిర్మించిన జాతీయ రహదారుల నిర్దిష్ట పరిధిలో (500 మీటర్లు) ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లపై రూ.25 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బీవోటీ డాక్యుమెంట్‌ను సవరించిందని రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి వి.ఉమాశంకర్ తెలిపారు. కాంట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక ఏడాదిలో హైవేలోని నిర్దిష్ట పరిధిలో ఒకటి కంటే ఎక్కువసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగితే సదరు కాంట్రాక్టర్ రూ.25 లక్షలు జరిమానాగా చెల్లించాలని, తర్వాతి ఏడాది కూడా ప్రమాదాలు పునరావృతమైతే ఫైన్ రూ.50 లక్షలకు పెరుగుతుందని తెలిపారు. హైవేల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 3,500 రోడ్డు ప్రమాదాల స్ర్టెచ్‌లను గుర్తించిందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆస్పత్రుల్లో నగదు రహితంగా చికిత్స అందించే పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుందని ఉమాశంకర్ చెప్పారు. కాగా, హైవేల నిర్మాణాలను ప్రధానంగా బీవోటీతో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం), ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతుల్లో చేపడుతారు. నిర్వహణతో సహా ప్రాజెక్టులకు రాయితీ కాలం బీవోటీ మోడల్‌లో 15-20 సంవత్సరాలు ఉండగా, హెచ్‌ఏఎంలో 15 ఏళ్లు ఉంటుంది.