VIT Chennai: ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:20 AM
వీఐటీ చెన్నై’ 13వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీఐటీ చెన్నై ప్రాంగణంలో జరిగిన ఈ స్నాతకోత్సవానికి వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ కె.విశ్వనాథన్ అధ్యక్షత వహించగా...
వీఐటీ వ్యవస్థాపకులు కె. విశ్వనాథన్
ఘనంగా ‘వీఐటీ చెన్నై’ 13వ స్నాతకోత్సవం
6,581 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం
చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘వీఐటీ చెన్నై’ 13వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీఐటీ చెన్నై ప్రాంగణంలో జరిగిన ఈ స్నాతకోత్సవానికి వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ కె.విశ్వనాథన్ అధ్యక్షత వహించగా, వర్సిటీ ఉపాధ్యక్షులు డా.శంకర్ విశ్వనాథన్, డా.జీవీ సెల్వం అతిథులను పరిచయం చేశారు. వైస్ చాన్స్‌లర్ డా.వీఎస్ కాంచన భాస్కరన్ స్వాగతోపన్యాసం చేశారు. తమిళనాడు సమాచార, సాంకేతిక శాఖ మంత్రి డా.పళనివేల్ త్యాగరాజన్ ముఖ్య అతిథిగా, చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెల్లీ సలేహిన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో 6,468 మంది అండర్ గ్రాడ్యుయేట్, 113 మంది పోస్టుగ్రాడ్యుయేట్ మొత్తం 6,581 మంది విద్యార్థిని,విద్యార్థులు పట్టాలు స్వీకరించారు. 39 మంది టాప్ ర్యాంకర్లు బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో విద్యార్థుల స్థూలనమోదు నిష్పత్తి కేవలం 29శాతమేనని, ఇది 50 శాతానికి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యకు కేవలం 2.5 శాతం నిధులు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ఉన్నత విద్య ద్వారా మాత్రమే భారతదేశం 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటవగలదని అభిప్రాయపడ్డారు. మంత్రి త్యాగరాజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి కారణం విద్యావంతులైన మహిళలు వివిధ పరిశ్రమల్లో పనిచేయటమేనన్నారు. ప్రస్తుతం విద్య అనేది ఉద్యోగం, నైపుణ్యాలను మెరుగుపరచడం గురించి మాత్రమే ఉందని, ఈ విధానాన్ని కొద్దిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక అతిథి షెల్లీ సలేహిన్ మాట్లాడుతూ... వీఐటీ వ్యవస్థాపకులు విశ్వనాథన్ నిర్వహిస్తున్న ఉన్నత విద్యాసంస్థల్లో డిగ్రీలు పూర్తిచేసిన వారెందరో బంగ్లాదేశ్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ఛాన్స్‌లర్ డా.డి.త్యాగరాజన్, అడ్వైజర్ డా.ఎస్పీ త్యాగరాజన్, వీఐటీ వేలూరు అసోసియేట్ వైస్ ఛాన్స్‌లర్ డా.పార్థసారధి మాలిక్, అదనపు రిజిస్ట్రార్ టి.జయభారతి, డా.పీకే మనోహరన్ తదితరులు పాల్గొన్నారు.