Heavy Rains Trigger Landslide: డార్జిలింగ్‌లో వరుణుడి బీభత్సం
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:30 AM
పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల డార్జిలింగ్..
భారీ వర్షాలకు వరదలు, విరిగిపడ్డ కొండచరియలు
వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది దుర్మరణం
డార్జిలింగ్, అక్టోబరు 5 : పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల డార్జిలింగ్, ఆ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తగా, చాలా చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో డార్జిలింగ్, ఆ జిల్లాలోని మిరీక్ సహా ఇతర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఘటనల్లో పలువురు చిన్నారులు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.ఒక్క మిరీక్ ప్రాంతంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రకటించాయి. మిరీక్, సిలిగురి ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిపై దుదియాలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. దీంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడడంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమై చాలా మంది నిరాశ్రయులవ్వగా.. పలువురి ఆచూకీ గల్లంతయింది. వర్షాలకు తోడు కొండచరియలు విరిగి పడుతుండడంతో డార్జిలింగ్‌లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసేశారు. డార్జిలింగ్ అందాలను చూసేందుకు వచ్చిన వేల మంది పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. సోమవారం వరకు డార్జిలింగ్‌లో భారీ వర్షాలు కొనసాగుతాయనే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోపక్క, భూటాన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి. కాగా, డార్జిలింగ్‌లో విపత్కర పరిస్థితిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరోవైపు, నేపాల్‌లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో నేపాల్‌లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు.