Heated Parliament Debate: షా 7 రాహుల్
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:40 AM
పార్లమెంటులో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగా పరస్పర సవాళ్లు చోటుచేసుకున్నాయి...
ఎన్నికల సంస్కరణలపై పార్లమెంటులో వాడీ వేడి చర్చ
న్యూఢిల్లీ, డిసెంబరు 10: పార్లమెంటులో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగా పరస్పర సవాళ్లు చోటుచేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ సహకారంతో బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షం అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా ఎవరుండాలన్నది చొరబాటుదారులు నిర్ణయిస్తే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉం టుందా? అని ప్రశ్నించారు. గత చరిత్రను ప్రస్తావిస్తే ప్రతిపక్షానికి కోపం వస్తుందని, కానీ.. ఏ దేశమైనా, సమాజమైనా చరిత్రను విస్మరించి ముందుకు ఎలా సాగుతుందని అన్నారు. ‘‘నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో 1952, 1957, 1961లో ఎస్‌ఐఆర్ చేపట్టారు. ఆపై లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హయాంలోనూ ఎస్‌ఐఆర్ చేపట్టారు. అనంతరం వాజపేయి, మన్మోహన్‌సింగ్‌ల హయాంలోనూ జరిగింది. ఆయా సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని వ్యతిరేకించలేదు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోవడమే ఇందుకు కారణం’’ అని అమిత్ షా అ న్నారు. గత నాలుగు నెలలుగా ప్రజలను ఎస్‌ఐఆర్‌ఫై తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. గత మూడు మీడియా సమావేశాల్లో తాను మాట్లాడిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమా? అంటూ అమిత్‌షాకు సవాల్ విసిరారు. తాను ప్రస్తావించిన అంశంపై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను ఏం మాట్లాడాలన్నది ప్రతిపక్ష నేత నిర్దేశించలేరంటూ అమిత్‌షా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఎస్‌ఐఆర్ అనేది దొడ్డిదారిలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయడమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మత ప్రాతిపదికన ఎంపిక చేసుకున్న ప్రజల ఓటుహక్కును తొలగించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరితమైన ప్రక్రియ అని అన్నారు.