Delivery Boy: నాకు మాటలు రావు.. చెవులు వినపడవు.. మెసేజ్ పంపినప్పుడు దయచేసి చూడండి!
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:15 AM
అంగ వైకల్యంతో బాధపడుతున్నా.. కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ బాయ్ అంకిత భావం నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నది....
కస్టమర్‌కు జొమాటో డెలివరీ బాయ్ మెసేజ్.. వైరల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: అంగ వైకల్యంతో బాధపడుతున్నా.. కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ బాయ్ అంకిత భావం నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నది. ఓ కస్టమర్‌కు ఆయన పంపిన టెక్స్ట్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలైంది. కొద్ది సేపట్లోనే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘జొమాటో’ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న వ్యక్తి తన కస్టమర్‌కు పంపిన టెక్ట్స్ మెసేజ్ అందరినీ ఆలోచింప జేసింది. ‘నేను మీ ఆర్డర్ తీసుకొస్తున్నా.. త్వరగానే మీకు అందజేస్తా’ అని పేర్కొంటూ.. ‘హలో.. నేను మూగవాడిని. ఇతరుల మాటలు వినలేని చెవిటి వాడిని. మీ చిరునామాకు వచ్చాక మెసేజ్ చేస్తాను. అది దయచేసి చూడండి’ అని పెట్టిన టెక్ట్స్ సందేశం స్ర్కీన్‌షాట్‌ను స్తుత్తి అనే యూజర్.. ‘కుటుంబం కోసం ఓ వ్యక్తి పడే కష్టాలు’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ డెలివరీ భాయ్ తన డ్యూటీ పట్ల దృఢ నిశ్చయాన్ని కొనియాడారు.