Share News

PolicyBazaar Report: జోరుగా ఆరోగ్య బీమా

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:17 AM

ఆరోగ్యబీమా పథకాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీని తొలగించడంతో ఆరోగ్య బీమా పట్ల ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగింది....

PolicyBazaar Report: జోరుగా ఆరోగ్య బీమా

  • ఇటీవలి కాలంలో ఏకంగా 38ు వృద్ధి

  • జీఎస్టీ ఎత్తివేతే ప్రధాన కారణం : పాలసీ బజార్‌ నివేదిక

న్యూఢిల్లీ, అక్టోబరు 30: ఆరోగ్యబీమా పథకాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీని తొలగించడంతో ఆరోగ్య బీమా పట్ల ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలికాలంలో 38శాతం వృద్ధి చెందిందని ప్రముఖ ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ పాలసీ బజార్‌ వెల్లడించింది. ఈమేరకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతంలో పాలసీదారులు ఎంచుకునే ఆరోగ్య బీమా కవరేజీ సగటున రూ.13 లక్షలు ఉండగా.. ఇప్పుడది రూ.18 లక్షలకు పెరిగింది. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారిలో దాదాపు సగం (45ు) మంది రూ.15-25 లక్షల కవరేజీని ఎంచుకుంటున్నారు. 24ు మంది రూ.10-15 లక్షల కవరేజీకి మొగ్గు చూపుతుండగా..18ు మంది రూ.10 లక్షలలోపు కవరేజీ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆరోగ్యబీమా ఉన్న వారు జీఎస్టీ తొలగింపు అనంతరం.. ఉన్న పాలసీకి మరిన్ని కొత్త సదుపాయాలను ఎంపిక చేసుకుంటూ అవసరమైన అదనపు ప్రీమియం చెల్లిస్తున్నారు. 61ఏళ్లు, ఆపై వయస్కుల్లో ఎక్కువ మొత్తం కవరేజీతో కూడిన బీమా పథకాల పట్ల ఆసక్తి 11.5ు పెరిగింది. చిన్న పట్టణాల్లోనూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. భారీ కవరేజీ ఉన్న బీమా పథకాలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఆరోగ్యబీమాపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి గణనీయంగా పెరిగిందని, జీఎస్టీ ఎత్తివేతే దీనికి ప్రధాన కారణమని పాలసీ బజార్‌ నివేదిక వెల్లడించింది.

Updated Date - Oct 31 , 2025 | 03:17 AM