Share News

Philip Acerman: తొలగించిన ఉద్యోగులకు మళ్లీ డిమాండ్‌!

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:05 AM

ఒకరి సంక్షోభం మరొకరికి అవకాశం. ఇది ప్రకృతి చేసే న్యాయం. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు విషయంలోనూ అదే జరగబోతోంది. టెక్‌ కంపెనీలకు పెనుభారంగా మారనున్న ఈ నిర్ణయం..

Philip Acerman: తొలగించిన ఉద్యోగులకు మళ్లీ డిమాండ్‌!

  • హెచ్‌-1బీ వీసా ఫీజు భారీ పెంపుతో మారిన పరిణామాలు

  • ఆ వీసాపై అమెరికాకు వెళ్లి.. ఇటీవలి కాలంలో ఉద్యోగం కోల్పోయినవారికి కంపెనీల పిలుపు

  • ప్రతిభావంతులైన భారతీయ టెకీలకు స్వాగతం: జర్మనీ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 24: ఒకరి సంక్షోభం మరొకరికి అవకాశం. ఇది ప్రకృతి చేసే న్యాయం. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు విషయంలోనూ అదే జరగబోతోంది. టెక్‌ కంపెనీలకు పెనుభారంగా మారనున్న ఈ నిర్ణయం.. ఇప్పటికే ఆ వీసాను కలిగి ఉండి, ఉద్యోగాలు పోగొట్టుకున్నవారికి వరంగా మారనుంది. అదెలా అంటే.. కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఒరాకిల్‌, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, ఏడబ్ల్యూఎస్‌ తదితర టెక్‌ దిగ్గజ సంస్థలు ఇటీవలికాలంలో చాలా మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. పొట్టోణ్ని పొడుగోడు కొడితే.. పొడుగోణ్ని పోచమ్మ కొట్టిందన్న సామెత చందంగా.. ఏఐ రాకతో కంపెనీలు తమ ఉద్యోగుల పొట్టకొడితే.. ట్రంప్‌ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఆ కంపెనీల తల బొప్పి కట్టించేలా చేసింది. కొత్త వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం కన్నా.. తీసేసిన పాత ఉద్యోగులనే మళ్లీ కొలువుల్లోకి తీసుకుందామనే నిర్ణయానికి ఆయా కంపెనీలు వస్తున్నాయి. గణాంకాలు చూస్తే.. 2025 జనవరి నుంచి ఇప్పటిదాకా టెక్‌ కంపెనీలు 1,44,926 మం దిని తొలగించాయి. వ్యయనియంత్రణ పేరుతోనో.. కృత్రిమ మేధ కారణంగానో.. 2024లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఏకంగా 2,38,461 కావడం గమనార్హం. హెచ్‌-1బీ వీసా కలిగి ఉండి ఇలా కంపెనీల నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి ఆ వీసా స్టేటస్‌ 60 రోజులపాటు యాక్టివ్‌గానే ఉంటుంది. ఆలోగా వారు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకోవడానికే ఆ వెసులుబాటు. అలా ఇటీవలికాలంలో ఉద్యోగాన్ని కోల్పోయినవారిలో చాలా మందికి.. తమ వద్ద చేరాలంటూ త్వరలోనే కంపెనీల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని ఇమిగ్రేషన్‌ లా ఫర్మ్‌ ‘చగ్‌ ఎల్‌ఎల్‌సీ’ న్యాయవాది నవనీత్‌ ఎస్‌ చగ్‌ తెలిపారు. వారికి హెచ్‌-1బీ వీసా ఉన్నందున.. మళ్లీ లాటరీలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సాధారణ ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ ద్వారా తమ కంపెనీలోకి తీసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండడంతో కంపెనీల దృష్టి అలాంటి ఉద్యోగులపై పడింది. కాగా.. ఇప్పటికే ఇండియాలో ఏర్పాటు చేసుకున్న గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న అమెరికన్‌ బ్యాంకులు సిటీగ్రూప్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూప్‌ వంటివి.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా జీసీసీలపై మరింతగా ఆధారపడేందుకు సిద్ధమవుతున్నట్టు బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.


మా దేశానికి రండి

నిపుణులైన భారతీయ టెకీలకు అమెరికా తన ద్వారాలు మూసేస్తుంటే.. వరుసగా ఇతర దేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల చైనా మన టెకీలకు ఆహ్వానం పలకగా.. తాజాగా జర్మనీ భారతీయ ప్రతిభకు తలుపులు తెరిచింది. ‘‘స్థిరమైన వలస విధానాలు, ఐటీ, మేనేజ్‌మెంట్‌, టెక్నాలజీ, సైన్స్‌ రంగాల్లో ఇండియన్లకు గొప్ప ఉద్యోగావకాశాలతో జర్మనీ ప్రత్యేకంగా నిలుస్తోంది.. అత్యంత నిపుణులైన భారతీయులకు ఇదే నా పిలుపు’’ అంటూ భారత్‌లో జర్మనీ రాయబారిగా ఉన్న డాక్టర్‌ ఫిలిప్‌ అకర్‌మాన్‌ ‘ఎక్స్‌’ ద్వారా పిలుపునిచ్చారు. జర్మనీలో స్థానికుల కన్నా అక్కడ పనిచేస్తున్న భారతీయుల సగటు సంపాదనే ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:05 AM