Share News

Nirmala Sitharaman: ముందే పండుగ

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:00 AM

దేశంలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలకు లైన్‌ క్లియర్‌ అయింది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది.

Nirmala Sitharaman: ముందే పండుగ

  • 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు.. పేదలు, మధ్య తరగతికి గణనీయంగా ఊరట

  • జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్‌ పచ్చజెండా

  • ఇప్పుడున్న నాలుగు శ్లాబులు.. రెండు శ్లాబులకు కుదింపు

  • జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేత

  • 33 రకాల అత్యవసర ఔషధాలపైనా పన్ను జీరో

  • ఇతర అన్ని మందులపై పన్ను 5 శాతానికి తగ్గింపు

  • సిమెంట్‌పై పన్ను 10 శాతం తగ్గింపు.. యథాతథంగా ఫోన్ల ధరలు

  • టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషీన్లు 28శాతం నుంచి 18శాతం కి..

  • కార్లపై రూ.75 వేల నుంచి లక్షన్నర దాకా ఊరట

  • లగ్జరీ కార్లపై రూ.10 లక్షల వరకు ఆదా

  • స్కూటర్లపై 10 వేల దాకా.. బైక్‌లపై 13 వేల దాకా..

  • రూ.2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరిగే చాన్స్‌

జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు.. పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యం.

- నిర్మలా సీతారామన్‌

దేశంలో దసరా, దీపావళికి ముందే పండుగ వస్తోంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అందివస్తున్నాయి. పాలు, పనీర్‌, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య, జీవిత బీమా మరింత చేరువ అవుతోంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ (వస్తుసేవల పన్ను) సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులు ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతోపాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతమున్న 12శాతం పన్నును పూర్తిగా తొలగించారు. వైద్యపరికరాలపై జీఎస్టీని 12ు నుంచి 5ుకు తగ్గించారు. దీనితో ప్రజల ఆరోగ్య భద్రతకూ మార్గం పడనుంది. నోట్‌బుక్‌లు, పెన్సిళ్లు, క్రయాన్లు, మ్యాప్‌లు, చార్టులపై జీఎస్టీని రద్దు చేయడం విద్యార్థులపై భారాన్ని తగ్గించనుంది. ఫోన్ల ధరల్లో మాత్రం మార్పు లేదు.


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3: దేశంలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలకు లైన్‌ క్లియర్‌ అయింది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. దీనితో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర, విలాస వస్తువులపై 40శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ వివరాలను వెల్లడించారు. దుర్గా నవరాత్రుల మొదటి రోజు అయిన సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దేశంలోని సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకే జీఎస్టీ సంస్కరణలు చేపట్టామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్నురేట్ల హేతుబద్ధీకరణ మాత్రమేకాదు.. పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యం. అందుకే లోతుగా సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నాం. మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పన్ను శ్లాబులను రెండుకు తగ్గిస్తున్నాం. ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లు ఉంటాయి. ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు చాలా వరకు తగ్గుతాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది’’ అని తెలిపారు. హానికర వస్తువుల కేటగిరీలోని పాన్‌ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతమున్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయని చెప్పారు.


రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని పూడ్చాలి..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజున సుదీర్ఘంగా జరిగిన భేటీలో.. జీఎస్టీలో సంస్కరణలు, శ్లాబుల హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం చేసిన సిఫార్సులపై చర్చించింది. ఈ సందర్భంగా జీఎస్టీ రేట్ల కుదింపునకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు అంగీకారం తెలిపారు. అయితే శ్లాబుల కుదింపుతో రాష్ట్రాలకు ఏటా సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఎన్డీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. హానికర, విలాస వస్తువులపై ప్రత్యేక పన్ను, దానిపై సర్చార్జీలు, సెస్‌ల ద్వారా ఆ నష్టాన్ని కేంద్ర భర్తీ చేయాలని కోరినట్టు సమాచారం. ఇక పెట్రోల్‌, డీజిల్‌ తదితరాలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలేవీ సానుకూలత వ్యక్తం చేయలేదని తెలిసింది. గురువారం జరిగే జీఎస్టీ మండలి భేటీలోనూ దీనిపై చర్చ జరిగే అవకాశం లేదని సమాచారం.


ప్రయోజనమెంత?

జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటివరకు 5శాతం పన్నురేటులో ఉన్న టెట్రాప్యాక్‌ పాలు, పనీర్‌, బ్రెడ్‌లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇప్పటివరకు 18శాతం, 12శాతం పన్ను రేట్లలో ఉండి.. ఇకపై 5శాతం పన్ను పరిధిలో వస్తున్న హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, షాంపూలు, టూత్‌ బ్రష్‌లు, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, పాస్తా, నూడుల్స్‌, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్‌, బటర్‌, నెయ్యి, హస్తకళాకృతులు, మార్బుల్‌, గ్రానైట్‌తోపాటు కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నస్టిక్‌ కిట్లు, కళ్లద్దాలు, సోలార్‌ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి.

  • పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ వాహనాలు, వాటి విడిభాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతోపాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలూ దిగివస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్‌ను ఎత్తివేయడంతో వాటి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లపై ఎప్పటిలాగే 5శాతం పన్ను కొనసాగనుంది. ఇక 350 సీసీ సామర్థ్యంలోపు ఉన్న ద్విచక్ర వాహనాలను 28శాతం పన్నురేటు నుంచి 18శాతానికి మార్చడంతో.. వాటి ధరలు పది శాతం మేర తగ్గనున్నాయి.

  • 40శాతం ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫీన్‌ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. పాన్‌ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు.

  • 18 శాతం పన్నురేటులో మొబైల్‌ ఫోన్లను యథాతథంగా కొనసాగించారు. దీనితో వాటి ధరల్లో మార్పు ఉండదు.

  • సిమెంట్‌పై పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. దీనితో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఊరట లభించనుంది. ఇళ్లు, ఫ్లాట్ల ధరలు కాస్త తగ్గేందుకు వీలుంటుంది

  • ప్రస్తుతం రూ.1000 లోపు ధర ఉన్న వస్త్రాలు, చెప్పులు, బూట్లపై 5శాతం, ఆపై ధర ఉంటే 12శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇకపై రూ.2,500 వరకు ధర ఉన్న వస్త్రాలు, పాదరక్షలపై 5శాతమే పన్ను వర్తిస్తుంది. అంటే రూ.1000 నుంచి రూ.2,500 వరకు ధర ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే రూ.2,500కుపైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18శాతం పన్నురేటులోకి వెళతాయి. అంటే.. వాటి ధరలు పెరుగుతాయి.


ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు

దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మల చెప్పారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్‌ పాలసీలు, సీనియర్‌ సిటిజన్ల పాలసీల ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, రిటర్నుల ఫైలింగ్‌, రీఫండ్‌ ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని, మానవ శ్రమ అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీతో రూ.16,398 కోట్లు వసూలు చేసింది. ఇందులో జీవిత బీమా నుంచి రూ.8,135 కోట్లు, ఆరోగ్య బీమా నుంచి రూ.8,263 కోట్లు వచ్చాయి.


సింగరేణి, ‘బొగ్గు’ విద్యుత్‌ భారం!

బొగ్గు, బొగ్గు ఆధారిత ఇంధనాలపై జీఎస్టీని ప్రస్తుతమున్న 5శాతం నుంచి 18శాతానికి పెంచారు. దీనితో బొగ్గు ధరలు పెరుగుతాయి. బొగ్గును వినియోగించే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై తీవ్ర భారం పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. బొగ్గును వినియోగించే ఉక్కు, సిమెంటు, ఎరువులు, రసాయన పరిశ్రమలకూ భారంగా మారుతుంది. మరోవైపు బొగ్గు డిమాండ్‌ పెంచేందుకు సింగరేణి ధరలు తగ్గించాల్సి వస్తుంది. దీనితో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక సిమెంట్‌పై పన్ను తగ్గించినా.. బొగ్గుపై పన్ను పెరగడంతో ధరలు తగ్గే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ప్రజా ఆరోగ్యానికి భద్రత

పలు రకాల ఔషధాలు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్‌ కిట్లు వంటివాటిపై ఇప్పటివరకు 12శాతం, 18శాతం వరకు పన్నులు ఉండగా.. ఇప్పుడన్నింటినీ 5శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ముఖ్యంగా కేన్సర్‌, ఇతర ప్రాణాధార, అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. దీనితో ప్రజా ఆరోగ్య భద్రతకు మేలు కలగనుంది.


350సీసీలోపు బైక్‌ల ధరలు తగ్గుతాయి

350సీసీలోపు మోటారు సైకిళ్ల ధరలు తగ్గుతాయి. వీటిపై 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, కేటీఎం వంటి 350సీసీ కంటే ఎక్కువ ఇంజన్‌ సామర్థ్యం బైక్‌ల ధరలు పెరుగుతాయి. ఇప్పటి వరకు వీటిపై 28 శాతం జీఎస్టీతో పాటు 2-3 సెస్‌ విధిస్తున్నారు. ఇక నుంచి సెస్‌ ఉండదు కానీ 40 శాతం పన్ను పరిధిలోకి వెళతాయి.


దుస్తులు, పాదరక్షలపై జీఎస్టీ ఇలా..

రూ.2,500కు మించిన ఉత్పత్తులపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడం పట్ల క్లోతింగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఏఐ) వంటి అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ పెంపుతో ఉన్ని, హస్తకళల దుస్తుల డిమాండ్‌పై ప్రభావం పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఎగుమతుల్లో మందగమనం, నగదు ప్రవాహ సమస్యలు ఉన్నట్టు చెబుతోంది. ఇక రూ.2,500 వరకు ధర ఉన్న ఉత్పత్తులపై పన్ను 5 శాతానికి తగ్గడం వల్ల వినియోగదారులకు ఊరట లభించనుంది.


వైద్య ఆరోగ్య రంగం ప్రస్తుతం తగ్గిన తర్వాత

  • వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా 18శాతం 0శాతం

  • మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ 12శాతం 5శాతం

  • డయాగ్నస్టిక్‌ కిట్లు, పరికరాలు 12శాతం 5శాతం

  • గ్లూకోమీటర్‌,టెస్ట్‌ స్ట్రిప్స్‌ 12శాతం 5శాతం

  • కళ్లజోళ్లు 12శాతం 5శాతం


ఎలాట్రానిక్ ఉపకరణాలు ప్రస్తుతం తగ్గిన తర్వాత

  • ఏసీలు, టీవీలు, వాషింగ్‌మెషీన్లు 28శాతం 18శాతం

    మానిటర్లు, ప్రొజెక్టర్లు


వ్యవసాయ రంగం

  • ట్రాక్టర్‌ విడిభాగాలు, టైర్లు 18శాతం 5శాతం

  • ట్రాక్టర్లు 12శాతం 5శాతం


జీఎస్టీ తగ్గింపు ఇలా..

నిత్యావసర వస్తువులు ప్రస్తుతం తగ్గిన తర్వాత

తల నూనెలు, షాంపూలు, టూత్‌పేస్టులు,

టూత్‌ బ్రష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లు, సబ్బులు 18శాతం 5శాతం

వెన్న, నెయ్యి, చీజ్‌, డెయిరీ స్ర్పెడ్‌లు 12శాతం 5శాతం

ప్రీప్యాక్డ్‌ నమ్కీన్‌, భుజియా, మిక్చర్‌లు 12శాతం 5శాతం

ఫీడింగ్‌ బాటిళ్లు, బేబీ న్యాప్కిన్లు, డైపర్లు 12శాతం 5శాతం

కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు 12శాతం 5శాతం

Updated Date - Sep 04 , 2025 | 07:05 AM