Share News

GST Cut Benefits: జీఎస్టీ తగ్గింపు లాభం.. దుకాణదారులకేనా

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:04 AM

జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాక ముందు ధరలు అవే.. తగ్గింపు అమల్లోకి వచ్చాకా ధరలు అవే.. మరి పన్ను తగ్గింపు లాభం ఎవరికి దుకాణదారులకే ప్రయోజనం తప్ప.. కొనుగోలుదారులకు లేదా?’’.. సాధారణ ప్రజల్లో..

GST Cut Benefits: జీఎస్టీ తగ్గింపు లాభం.. దుకాణదారులకేనా

  • పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎమ్మార్పీలే..

  • చాలా వరకు ఉత్పత్తులు పాత ధరకే విక్రయం

  • ధరల నియంత్రణపై కొరవడిన నిఘా

  • ఉల్టా కొన్ని సరుకులపై ధరల పెంచేశారంటూ వినియోగదారుల్లో ఆందోళన

  • చాలా సూపర్‌ మార్కెట్లు, సూపర్‌ బజార్లలో కనిపించని కొత్త ఎమ్మార్పీల స్టిక్కర్లు

  • ‘ఎన్‌ఏఏ అథారిటీ’ ఏం చేస్తోందనే విమర్శలు

  • సెప్టెంబరు 9 నాటి కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోని అధికారులు, దుకాణదారులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాక ముందు ధరలు అవే.. తగ్గింపు అమల్లోకి వచ్చాకా ధరలు అవే.. మరి పన్ను తగ్గింపు లాభం ఎవరికి? దుకాణదారులకే ప్రయోజనం తప్ప.. కొనుగోలుదారులకు లేదా?’’.. సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఇది. చాలా వస్తువుల ధరల్లో పెద్దగా మార్పేమీ లేదని, కొన్నింటి ధరలు పెంచేశారని వారు వాపోతున్నారు. ధరల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి సాధారణ ప్రజలకు బతుకుభారం నుంచి కాస్త ఉపశమనం కల్పించేందుకు నిత్యావసరాలపై కేంద్రం జీఎస్టీ తగ్గించింది. 18శాతం, 12శాతం పన్ను కింద ఉండే చాలా ఉత్పత్తులు 5శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. దీనితో దసరా, దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పేరున్న సూపర్‌ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు, చిన్నపాటి సూపర్‌ బజార్లలో ధరల తగ్గింపు కనిపించడం లేదు.


మార్గదర్శకాలను పట్టించుకునేదెవరు?

జీఎస్టీ శ్లాబుల్లో మార్పు నేపథ్యంలో.. పాత స్టాక్‌ మీద ముద్రించి ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)ను మార్చి, కొత్త ధరలతో స్టిక్కర్‌ వేసేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు సెప్టెంబరు 9వ తేదీనే మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ తయారీ సంస్థలు, విక్రయించే వ్యాపార సంస్థలు వాటిని పాటించడం లేదు. ఉదాహరణకు ఒక సూపర్‌ మార్కెట్లో పరిశీలిస్తే.. సెప్టెంబరు 12న ప్యాకింగ్‌ చేసిన ప్రియ వంటనూనె ప్యాకెట్‌పై రూ.205 ఎమ్మార్పీ ముద్రించి ఉంది. తగ్గిన పన్ను మేరకు దానిపై తగ్గిన ధరతో స్టిక్కర్‌ వేయాల్సి ఉన్నా సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు అలాగే విక్రయిస్తున్నారు. అలాగే సఫోలా గోల్డ్‌ వంటనూనె (5 లీటర్ల క్యాన్‌)మీద ఎమ్మార్పీ ధర రూ.1,182 ముద్రించి ఉంది. దానిపై మారిన జీఎస్టీ ప్రకారం స్టిక్కర్‌ వేయలేదు. మరోవైపు టాటా సింప్లీ బెటర్‌ గ్రౌండ్‌నట్‌ కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనె 5 లీటర్ల క్యాన్‌ను సెప్టెంబరు 9న ఈ-కామర్స్‌ వేదిక జెప్టో రూ.1,483కు విక్రయించిందని.. అదే క్యాన్‌ను సెప్టెంబరు 23న 1,775 ధర పెట్టడం చూసి ఆశ్చర్యపోయామని కొనుగోలుదారులు చెబుతున్నారు.ఎప్పుడైనా ధరలు పెరిగితే రాత్రికి రాత్రి స్టిక్కర్లు వేసి అధిక ధరలకు అమ్ముతారని.. ఇప్పుడు మాత్రం తగ్గించుకుండా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పన్ను తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడికి చేరకపోతే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఎన్‌ఏఏ అథారిటీ ఉన్నట్టా లేనట్టా?

వ్యాపార సంస్థలు పన్నుల్లో తేడాలను అక్రమంగా సొమ్ము చేసుకోకుండా.. జీఎస్టీ కౌన్సిల్‌ కింద ‘నేషనల్‌ యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీ (ఎన్‌ఏఏ)’ అనే సంస్థ పనిచేస్తుంది. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అథారిటీ ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ధరలు తగ్గించని వ్యాపారులపై ఫిర్యాదు కోసం సరైన వేదికను అందుబాటులోకి తేలేదని వినియోగదారులు వాపోతున్నారు. జీఎస్టీ తగ్గినా ధరలు తగ్గడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొంత మంది ట్యాగ్‌ చేస్తున్నారు. ప్రతి వస్తువు మీద పాత, కొత్త ధరలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి విక్రయించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 08:02 AM