Share News

Salumarada Thimmakka passes away : వృక్షమాత తిమ్మక్క కన్నుమూత

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:20 AM

వృక్షమాతగా పేరొందిన సాలుమరద తిమ్మక్క(114) వయోసహజ ఆరోగ్య సమస్యలతో బెంగళూరులో శుక్రవారం కన్నుమూశారు...

Salumarada Thimmakka passes away : వృక్షమాత తిమ్మక్క కన్నుమూత

బెంగళూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వృక్షమాతగా పేరొందిన సాలుమరద తిమ్మక్క(114) వయోసహజ ఆరోగ్య సమస్యలతో బెంగళూరులో శుక్రవారం కన్నుమూశారు. బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లా మాగడి తాలూకా హులికల్‌ గ్రామ వాసి తిమ్మక్క బెంగళూరులో పెంపుడు కుమారుడు ఉమేశ్‌ బల్లూరతో కలసి ఉంటున్నారు. తీవ్రశ్వాస సమస్య తలెత్తడంతో 2 రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక ఆమె తుదిశ్వాస విడిచారు. తిమ్మక్క, చిక్కయ్య దంపతులకు పిల్లలు లేరు. సంతానం లేదనే బాధనుంచి బయటపడేందుకు ఆమె హులికల్‌ గ్రామ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి, కన్న బిడ్డల తరహాలో పెంచారు. తిమ్మక్క మృతిపట్ల ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె ఆస్పత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి కుమారస్వామి ఎక్స్‌లో సంతాపం తెలిపారు. పచ్చదనమే జీవనమని జీవితకాలం సేవలందించిన తిమ్మక్క మృతి బాధాకరమని మాజీ ప్రధాని దేవెగౌడ పేర్కొన్నారు. హోం మంత్రి పరమేశ్వర్‌ సహా పలువురు మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 15 , 2025 | 04:20 AM