Government Plane Services: ఆధ్యాత్మికవేత్తకు ప్రభుత్వ విమాన సేవలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:32 AM
బగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్రశాస్త్రిని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌నకు ప్రభుత్వ విమానంలో తీసుకురావటం, ఎయిర్‌పోర్టులో ఓ పోలీసు అధికారి ఆయనకు పాదాభివందనం చేయటం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.
ఎయిర్‌పోర్టులో పోలీసు అధికారి పాదాభివందనం
ఛత్తీస్‌గఢ్‌లో ధీరేంద్రశాస్త్రి పర్యటనపై రాజకీయ కలకలం
రాయ్‌పూర్, డిసెంబరు 27: బగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్రశాస్త్రిని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌నకు ప్రభుత్వ విమానంలో తీసుకురావటం, ఎయిర్‌పోర్టులో ఓ పోలీసు అధికారి ఆయనకు పాదాభివందనం చేయటం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో ని దుర్గ్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో పాల్గొనేందుకు ధీరేంద్రశాస్త్రి గురువారం రాయ్‌పూర్ చేరుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి గురుకుశ్వంత్ సాహెబ్ కూడా ఉన్నారు. విమానం నుంచి వీరిద్దరూ దిగిన తర్వాత.. అక్కడ డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.. మంత్రికి ప్రొటోకాల్ ప్రకారం సెల్యూట్ చేశారు. అనంతరం బూట్లు విప్పి, తల మీదున్న టోపీ తొలగించి ధీరేంద్రశాస్త్రి పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అనుకూల, ప్రతికూల వాదనలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి, సమాజంలో సోదరభావాన్ని ధ్వంసం చేస్తున్న ధీరేంద్రశాస్త్రి వంటి వ్యక్తి కోసం ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించటం.. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయటమేనని విమర్శించారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అందువల్లే విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు.