Share News

Wakf Properties: ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కుండదు

ABN , Publish Date - May 22 , 2025 | 05:22 AM

కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తులపై హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని, వక్ఫ్‌ ‘ప్రాథమిక హక్కు’ కాదని స్పష్టంచేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ జరుగుతుండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసవి సెలవుల్లో కేసులు ఆలస్యం అవుతున్నదానిపై న్యాయవాదులను విమర్శించారు.

Wakf Properties: ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కుండదు

సర్కారీ స్థలాన్ని, వక్ఫ్‌గా ప్రకటించిన భూమిని రక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది: కేంద్రం

వక్ఫ్‌ దాతృత్వానికి సంబంధించినది

ఇస్లాంలో ముఖ్య భాగం కాదు

సుప్రీంకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 21: వక్ఫ్‌ దాతృత్వానికి సంబంధించినదని.. ఇస్లాంలో ముఖ్య భాగం కాదని కేంద్రం స్పష్టంచేసింది. ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కుండదని తేల్చిచెప్పింది. సర్కారీ భూములు, వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని పేర్కొంది. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ మాసి్‌హలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, రాజీవ్‌ ధావన్‌, అభిషేక్‌ మను సింఘ్వీ తదితరుల వాదనలను ఆలకించింది. బుధవారం కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘వక్ఫ్‌ బై యూజర్‌’ సూత్రాన్ని అనుసరించి వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటించిన ప్రాపర్టీలను తిరిగి తీసుకునే చట్టబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ‘వక్ఫ్‌ బై యూజర్‌’ ప్రాథమిక హక్కు కాదన్నారు. పైగా వక్ఫ్‌ సవరణ చట్టం వల్ల బాధితులయ్యేవారెవరూ కోర్టుకు రాలేదని తెలిపారు. ‘1923 నుంచీ ఉన్న ఈ భయానక సమస్యను మేం పరిష్కరిస్తున్నాం. చట్టం చేసే ముందు రాష్ట్రప్రభుత్వాలను, రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డులను సంప్రదించాం. జేపీసీ వేశాం. ప్రతి భాగస్వామితోనూ చర్చించాం. కొద్ది మంది పిటిషనర్లు వచ్చి.. మొత్తం ముస్లిం వర్గానికి మేం ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనలేరు’ అని వ్యాఖ్యానించారు. వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు వక్ఫ్‌బోర్డు విధులని..ఇవి పూర్తిగా లౌకిక కర్తవ్యాలని.. ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉన్నంత మాత్రాన దాని స్వభావం మారదని పేర్కొన్నారు. వారు మైనారిటీగానే ఉంటారని తెలిపారు.


సెలవుల్లో పనిచేయకపోగా నిందలా!

న్యాయవాదులు వేసవి సెలవుల్లో పనిచేయకపోగా కేసులు పేరుకుపోతున్నాయంటూ కోర్టులపై నిందలు వేస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ చురకలంటించారు. ఓ పిటిషన్‌ను వేసవి సెలవుల తర్వాత విచారణకు వచ్చేలా చూడాలని న్యాయవాది ఒకరు కోరినప్పుడు జస్టిస్‌ గవాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి ఐదుగురు సీనియర్‌ జడ్జిలు ఈ వేసవి సెలవుల్లో కూడా పనిచేయనున్నారని, నిజానికి సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులేనని అన్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 05:23 AM