Drone Manufacturing: డ్రోన్ల తయారీకి రూ.20వేల కోట్ల ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:16 AM
దేశంలో డ్రోన్ల తయారీకి భారీ ఊతం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల తయారీ, విడిభాగాల రూపకల్పన, యాంటీ డ్రోన్ వ్యవస్థకు భారీ మద్దతు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో డ్రోన్ల తయారీకి భారీ ఊతం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల తయారీ, విడిభాగాల రూపకల్పన, యాంటీ డ్రోన్ వ్యవస్థకు భారీ మద్దతు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో స్వదేశీ డ్రోన్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సుమారు రూ.20 వేల కోట్లమేరకు ప్రోత్సాహకాలను అందించనుంది. గత మేలో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో దాయాది దేశానికి టర్కీ, చైనాలు డ్రోన్ల సాయం చేశాయి. అదేవిధంగా చైనా కూడా అధునాతన డ్రోన్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల భద్రత, సీమాంతర ఉద్రిక్తతలను బలంగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా బలమైన డ్రోన్ వ్యవస్థను కలిగి ఉండాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే రూ.20 వేల కోట్ల ప్రోత్సాహకాలతో డ్రోన్ల రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్టు అధికారులు తెలిపారు. తాజా పథకంలో చిన్న, మధ్య తరహా డ్రోన్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ద్వారా స్వల్ప వడ్డీకే రుణాలు ఇప్పించనున్నారు. కాగా, దేశంలో ఇప్పటికే 600లకు పైగా కంపెనీలు డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి.