Gold Scam: బంగారం కొంటే లాభాలంటూ బిస్కెట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:13 AM
ఆయనో బంగారం వ్యాపారి.. సాయి కమల్ జువెలర్స్ పేరిట బళ్లారిలో ఎన్నో ఏళ్లుగా గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో...
కస్టమర్లతో కొనిపించి తన వద్ద పెట్టుకున్న వ్యాపారి
రూ.40 కోట్ల గోల్డ్‌తో పరార్.. బళ్లారిలో ఘటన
బళ్లారి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆయనో బంగారం వ్యాపారి.. సాయి కమల్ జువెలర్స్ పేరిట బళ్లారిలో ఎన్నో ఏళ్లుగా గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో.. కొని పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని చెబితే ఆయన కస్టమర్లలో చాలామంది బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి ఆయనకు అప్పగించారు. కానీ, ఆయన రూ.40 కోట్ల విలువైన బంగారంతో పరారయ్యాడు. బళ్లారిలోని సాయి కమల్ జువెలర్స్ యజమాని జగదీష్ గుప్తా ఇంటికి, బళ్లారిలోని బెంగళూరు రోడ్డులో ఉన్న బంగారం షాపునకు 15 రోజులుగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన వద్ద బంగారం బిస్కెట్లు ఉంచిన 200 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం.. బళ్లారిలో జగదీష్ గుప్తాతోపాటు అతని సోదరులు కూడా ఏళ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షాపునకు వచ్చిన కస్టమర్లకు జగదీష్ గుప్తా.. బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోందనీ, కొని పెట్టుకోవాలని సూచించేవాడు. దీంతో చాలామంది బంగారం బిస్కెట్లు కొనుగోలు చేశారు. వాటిని ఇంట్లో పెట్టుకుంటే లాభం రాదనీ, తన వద్ద ఉంచితే ఆభరణాలు చేసి షాపులో ఉంచుతానని చెప్పారు. మీకు వడ్డీ వేసి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో బళ్లారిలో ఉండే ప్రముఖులతో పాటు సమీప ప్రాంతాలవారు సైతం బంగారం కొని జగదీష్ వద్ద ఉంచారు. ఇలా దాదాపు 200 మంది బంగారం ఆయన వద్ద ఉంచారు. దాని విలువ రూ.40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బళ్లారికి చెందిన ఓ ప్రముఖుడు రూ.3 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు జగదీష్ వద్ద ఉంచినట్లు తెలుస్తోంది.