Gold Hits Record High: స్వర్ణం.. సరికొత్త గరిష్ఠం!
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:02 AM
బంగారం ధర భగ్గుమంటోంది. పండగల కాలంలో పసిడి కొండెక్కుతోంది. రోజురోజుకూ సామాన్యులు అందుకోలేని స్థాయికి ఎగబాకుతోంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో..
10 గ్రాముల ధర రూ.1,18,900
ఒక్కరోజులో రూ.2,700 పెరుగుదల
అదే బాటలో వెండి.. రూ.3,220 పెరిగి కిలో రూ.1.39 లక్షలకు చేరిన వైనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: బంగారం ధర భగ్గుమంటోంది. పండగల కాలంలో పసిడి కొండెక్కుతోంది. రోజురోజుకూ సామాన్యులు అందుకోలేని స్థాయికి ఎగబాకుతోంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర ఏకంగా రూ.2,700 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.1,18,900కి చేరింది. 99.5ు స్వచ్ఛత కలిగిన స్వర్ణం ధర కూడా రూ.2,650 పెరుగుదలతో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి రూ.1,18,300కి ఎగబాకింది. కిలో వెండి సైతం రూ.3,220 పెరిగి రూ.1,39,600 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరగడంతో పాటు హెచ్-1బీ వీసా ఫీజు పెంపు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌పీఐ) ఉపసంహరణ ఫలితంగా రూపాయి ఆల్‌టైం కనిష్ఠానికి పతనమవడం కూడా ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరు 31న రూ.78,950 పలికిన తులం బంగారం ధర.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.39,950 (50.60ు) మేర పెరిగింది. అదేసమయంలో రూ.89,700గా ఉన్న కిలో వెండి ధర.. ఈ ఏడాది ఇప్పటికే 49,900 (55.63ు) మేర పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1,750 పెరిగి రూ.1,14,330కి చేరింది. కేజీ వెండి రూ.1,000 పెరిగి రూ.1,49,000కి చేరింది. విజయవాడ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.1,17,900, కేజీ వెండి రూ.1.39,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర సరికొత్త పతాక స్థాయికి చేరింది. ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 0.95 శాతం పెరుగుదలతో 3,811 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ 44.57 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరో రెండు సార్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడ్ రేట్లు మరింత తగ్గితే అమెరికా డాలర్, బాండ్లపై ప్రతిఫలాలు తగ్గుతాయన్న ముందు జాగ్రత్తతో మదుపరులు తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త శిఖరాన్ని అధిరోహిస్తున్నాయి.