జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడిగా సతీశ్‌రెడ్డి
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:51 AM
జాతీయ భద్రత సలహా మండలి (ఎన్‌ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్‌డీవో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రత మండలి సచివాలయం ఉప కార్యదర్శి పుష్పేంద్ర కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్
క్షిపణి వ్యవస్థలపై పరిశోధనల్లో కీలక పాత్ర
రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సేవలు
ఇటీవలే క్యాబినెట్ హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు
న్యూఢిల్లీ, జూన్ 10: జాతీయ భద్రత సలహా మండలి (ఎన్‌ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్‌డీవో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రత మండలి సచివాలయం ఉప కార్యదర్శి పుష్పేంద్ర కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. సతీశ్‌రెడ్డి ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. 2027 జూన్ 9 వరకు.. లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఎన్‌ఎస్ఏబీ సభ్యుడిగా ఉంటారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి డీఆర్‌డీవో చైర్మన్‌గా, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ఆయనను విమానయానం, రక్షణ రంగాల్లో గౌరవ సలహాదారు(రాష్ట్ర క్యాబినెట్ హోదా)గా ఈ ఏడాది మార్చి 19న నియమించింది. ఆయన భారతదేశ క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.