Former Union Minister Shivraj Patil Passes Away: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:19 AM
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివ్‌రాజ్ పాటిల్(90) తన స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో శుక్రవా రం ఉదయం మరణించారు...
లాతూర్, ముంబై, డిసెంబరు 12: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివ్‌రాజ్ పాటిల్(90) తన స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో శుక్రవా రం ఉదయం మరణించారు. స్వల్ప అస్వస్థతకు గురై ఆయన మృతి చెందారని బంధువులు తెలిపారు. ఆయనకు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. శివ్‌రాజ్ పాటిల్ తుది శ్వాస వరకు నెహ్రూ-గాంధీ కుటుంబ విధేయుడిగా కాంగ్రె్‌సతోనే ఉన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన రాజకీయ జీవితంలో పలు కీలక పదవులు నిర్వహించారు. 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆ దాడులు జరిగిన నవంబరు 26వ తేదీ రాత్రి మూడుసార్లు వేర్వేరు దుస్తులు ధరించి కనిపించడంతో ప్రజలు, మీడియా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ విమర్శలకు జవాబిస్తూ.. ప్రజలు తన పనితీరును చూడాలని దుస్తులను కాదని పేర్కొన్నారు. అయితే ఈ దాడుల ప్రభావం ఆయన పదవిపై పడింది. దీంతో ఆయన 2008 నవంబరు 30వ తేదీన కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిం ది. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతోపాటు పలువురు నేతలు పాటిల్ మృతికి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తన సంతాపం తెలియజేస్తూ.. సమాజ సంక్షేమంపై శివ్‌రాజ్ పాటిల్‌కు ఎంతో ఆసక్తి అని పేర్కొన్నారు. ఇటీవలే ఆయన్ను కొద్ది నెలల క్రితం తన నివాసంలో కలుసుకొన్నానని తెలిపారు.