Lokayukta Raids on Retired PWD Chief Engineer: కిలోల్లో బంగారం.. టన్నుల్లో తేనె!
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:37 AM
సోదాలు నిర్వహించిన అధికారులే నోరెళ్లబెట్టేలా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఇళ్లలో భారీగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం బయటపడింది. అంతేనా..
భోపాల్‌లో మాజీ చీఫ్ ఇంజనీర్ వద్ద భారీ ఆస్తులు
2.64 కిలోల పసిడి, 36 లక్షల నగదు స్వాఽధీనం
భోపాల్, అక్టోబరు 10: సోదాలు నిర్వహించిన అధికారులే నోరెళ్లబెట్టేలా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఇళ్లలో భారీగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం బయటపడింది. అంతేనా.. బయట అత్యంత విలాసవంతమైన కార్లు పార్క్‌చేసి ఉన్నాయి. ఆయనగారి వ్యవసాయ క్షేత్రంలోకి వెళితే ఏడు కాటేజీలు, నిర్మాణంలో ఉన్న మరో 32 కాటేజీలు కనిపించాయి. భారీ చేపల చెరువు కనిపించింది. టన్నులకొద్దీ నిల్వ చేసిన తేనె లభ్యమైంది. ఇదంతా మధ్యప్రదేశ్‌లో జీపీ మెహ్రా అనే ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కూడబెట్టిన సంపద! ఇది తమ ఊహకు అందనంత విలువైన సొత్తు అని సోదాలు నిర్వహించిన లోకాయుక్త అధికారులు వెల్లడించారు. నలుగురు డీఎస్పీ ర్యాంకు అధికారుల నేతృత్వంలోని బృందాలు శుక్రవారం తెల్లవారుజామున భోపాల్, నర్మదాపురంలో మెహ్రాకు సంబంధించిన నాలుగు స్థావరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. మణిపురం కాలనీలోని మెహ్రా నివాసంలో రూ.8.79 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన బంగారు నగలు, రూ.56 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను సీజ్ చేశారు. దనాపానీలో ఆయన లగ్జరీ ఫ్లాట్‌లో రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సోహాగ్‌పూర్‌లోని ఆయన ఫామ్‌హౌ్‌సలో మెహ్రా వైభోగం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ ఫామ్‌హౌ్‌సలో ప్రత్యేకంగా ఓ గోశాల, ఓ ఆలయాన్ని నిర్మించారు. అలాగే మెహ్రా వ్యాపార సంస్థగా భావిస్తున్న గోవిందాపురలోని కేటీ ఇండస్ట్రీ్‌సపైనా లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.36.04 లక్షల నగదు, 2.64 కిలోల బంగారం, 5.52 కిలోల వెండి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సురెన్స్‌కు సంబంధించిన పత్రాలు సీజ్ చేశారు.