Former Maoist Leader Mallojula: సాయుధ పోరాటం.. విఫల మార్గం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:02 AM
మావోయిస్టులు ఆయుధాలను వీడి.. ప్రధాన స్రవంతిలో కలిసి పనిచేయాలని ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత...
పరిస్థితులు మారాయి.. ప్రధాన స్రవంతిలో కలవండి
మావోయిస్టులకు మల్లోజుల వీడియో సందేశం
గడ్చిరోలి, నవంబరు 1: మావోయిస్టులు ఆయుధాలను వీడి.. ప్రధాన స్రవంతిలో కలిసి పనిచేయాలని ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి ఓ వీడియో సందేశంలో కోరారు. ఎవరైనా ఆయుధాలను వీడాలని భావిస్తుంటే సంప్రదించాలంటూ తనది, లొంగిపోయిన మరో మావోయిస్టు నేత రూపేష్ ఫోన్ నంబర్లు ఇచ్చారు. సాయుధ పోరాటాన్ని ‘విఫల మార్గం’గా పేర్కొన్న ఆయన... మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టాలన్నారు. పరిస్థితులు మారాయని, ప్రజల మధ్య ఉండి చట్ట పరిధిలో పనిచేయాలని కోరారు. తమ చర్యల వల్ల ప్రజల నుంచి దూరమైన విషయాన్ని వారు గుర్తించాలని సూచించారు. సాయుధ పోరాటాన్ని వీడడానికి సుముఖంగా లేని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మొండి వైఖరిని అవలంబిస్తోందని, మార్పులను గ్రహించడం లేదని విమర్శించారు. తాను, తనతో పాటు లొంగిపోయిన నక్సలైట్లను ద్రోహులంటూ విమర్శిస్తున్న వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, ముఖ్యంగా గిరిజనుల మేలు కోరేవారు తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వాలని కోరారు. గడ్చిరోలి పోలీసులు శనివారం పత్రికా ప్రకటనతో పాటు మల్లోజుల వీడియోను విడుదల చేశారు. ఆయన గత నెల 14న 60 మంది మావోయిస్టులతో, రూపేష్ అలియాస్ సతీష్ గత నెల 17న 200 మంది మావోయిస్టులతో కలిసి పోలీసులకు లొంగిపోయారు.