Eating Habits of Children and Teens: యాడ్స్‌లో ఏది చూపిస్తే.. అదే తింటున్నారు!
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:07 AM
పిల్లలు, యువత ఆహారపు అలవాట్లపై వాణిజ్య ప్రకటనలు(యాడ్స్) గణనీయంగా ప్రభావం చూపెడుతున్నాయని దేశవ్యాప్త సర్వేలో వెల్లడైంది.
వాణిజ్య ప్రకటనలు చూసి ఆహార అలవాట్లనుపాటించేవారు, మార్చుకునేవారు 67.6ు మంది
10-19ఏళ్ల వయసున్న 1.44లక్షల మందిపై నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 30: పిల్లలు, యువత ఆహారపు అలవాట్లపై వాణిజ్య ప్రకటనలు(యాడ్స్) గణనీయంగా ప్రభావం చూపెడుతున్నాయని దేశవ్యాప్త సర్వేలో వెల్లడైంది. యాడ్స్ చూసి తమ ఆహారపు అలవాట్లను పాటిస్తున్నట్లు, మార్చుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న 67.6ుమంది చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10-19ఏళ్ల మధ్య వయసున్న 1.44లక్షల మందిపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్, ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీ, యునిసెఫ్ ఇండియా సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. యునిసె్‌ఫకు చెందిన యూ-రిపోర్ట్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా, స్కూళ్లలో పిల్లలను కలుసుకొని ప్రశ్నించడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం.. తమకు పోషకాహారంపై అవగాహన ఉన్నా వాటి రేట్లు ఎక్కువగా ఉన్నందున తినలేకపోతున్నామని 30.7ు మంది చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం రుచిగా ఉండదని, అందుకే తినడానికి ఇష్టపడట్లేదని 15.3శాతం మంది తెలిపారు. ఇక, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు సంబంధించి అందులో ఉండే పోషకాల సమాచారం లేబుళ్లపై ముద్రించాలని 72.6ు మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్యాకెట్లపై ముద్రిస్తున్న సమాచారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని 62.8శాతం మంది అన్నారు. ఇదిలా ఉండగా, పోషకాహారానికి సంబంధించిన సమాచారాన్ని స్కూల్‌లో తెలుసుకుంటామని 49.5శాతం మంది చెప్పారు. కాగా, ఎన్నో నిబంధనలు అమల్లో ఉన్నా అనారోగ్యకరమైన ఆహార ప్రకటనలు వస్తున్నాయని, ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని సర్వే నివేదిక పేర్కొంది.