Share News

Bihar Assembly Elections: బిహార్లో నేడే తుది పోరు

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:15 AM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. రెండోది, చివరి విడత ఎన్నికల్లో 122 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగనుంది. వివిధ ప్రధాన పార్టీల నేతలు సహా 1,302 మంది ...

Bihar Assembly Elections: బిహార్లో నేడే తుది పోరు

  • 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌

  • 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 1,302 మంది అభ్యర్థుల భవిత

  • 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు

  • నవయువ ఓటర్లు 7.69 లక్షలు

  • బరిలో పలువురు మంత్రులు

  • ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి

పట్నా, నవంబరు 10: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. రెండోది, చివరి విడత ఎన్నికల్లో 122 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగనుంది. వివిధ ప్రధాన పార్టీల నేతలు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3.75 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలతో నిక్షిప్తం చేయనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలే. 18-19 ఏళ్ల వయసుగల నవయువ ఓటర్లు 7.69 లక్షల మంది. సజావుగా పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లూ చేసింది. 45,399 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధంచేసింది. వీటిలో 40,073 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. 8,491 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో ఒక్క గయాజీలోనే 1,084 కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు మొత్తం 122 స్థానాల్లోనూ భారీగా భద్రతాబలగాలను మోహరించారు. ఇప్పటికే 500 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ముందస్తు ఎన్నికల విధుల్లో ఉండగా.. వీటితోపాటు మరో 500 కంపెనీల సాయుధ సిబ్బందికి పోలింగ్‌ బాధ్యతలు అప్పటించారు. వీరుగాక 60 వేల మంది బిహార్‌ పోలీసులు, 30 వేల బిహార్‌ సాయుధ పోలీసు సిబ్బంది, 20 వేల మంది హోంగార్డులు, శిక్షణలో ఉన్న మరో 19 వేల మంది కొత్త పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 2 వేల మంది సిబ్బందిని మోహరించారు. నవాదా జిల్లా హిసువా స్థానంలో అత్యధికంగా 3.67 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. లౌరియా, చంపటియా, రక్సౌల్‌, త్రివేణిగంజ్‌, సుగౌలీ, బణ్‌మన్‌ఖీ సీట్లలో 22 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 65 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న ఓట్లు లెక్కించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.


సీమాంచల్‌పైనే పార్టీల దృష్టి

ఎన్నికలు జరిగే జిల్లాల్లో అత్యధికం పూర్వాంచల్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇది ముస్లిం ప్రాబల్య ప్రాంతం కావడంతో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని పాలక ఎన్‌డీఏ, విపక్ష ఇండీ కూటమి పార్టీలతో కూడిన మహాగఠ్‌బంధన్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముస్లిం ఓట్లు తనకేనని గఠ్‌బంధన్‌ భావిస్తుండగా.. చొరబాటుదార్లకు విపక్షం అండగా నిలుస్తోందని ఎన్‌డీఏ ఆరోపిస్తోంది. నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు బ్రిజేంద్రప్రసాద్‌ యాదవ్‌ (సుపాల్‌), లేశీ సింగ్‌ (ధమ్‌దాహా), షీలా మండల్‌ (ఫుల్‌పరాస్‌), జమాఖాన్‌ (చైన్‌పూర్‌)-జేడీయూ.. ప్రేమ్‌కుమార్‌ (గయ), రేణుదేవి(బెతియా), నీరజ్‌కుమార్‌ సింగ్‌(ఛతర్‌పూర్‌), మాజీ ఉపముఖ్యమంత్రి తార్‌కిశోర్‌ ప్రసాద్‌ (కతిహార్‌)-బీజేపీ.. పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్‌ (కుటుంబ), కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌ (కడ్వా), సీపీఐఎంఎల్‌-లిబరేషన్‌ పక్ష నేత మెహబూబ్‌ ఆలం (బలరాంపూర్‌) బరిలో ఉన్నారు. కాగా, హెచ్‌ఏఎంకు కేటాయించిన ఆరు స్థానాలకు, ఆర్‌ఎల్‌ఎంకు ఇచ్చిన ఆరు స్థానాల్లో నాలుగింటికి రెండో దశలోనే పోలింగ్‌ జరుగుతోంది.

స్త్రీ-పురుష వారీ ఓటింగ్‌ వివరాలేవీ?: తేజస్వీ

బిహార్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో స్త్రీ-పురుషుల వారీగా ఓటింగ్‌ వివరాలను ఎన్నికల కమిషన్‌ వెల్లడించకపోవడాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రశ్నించారు. ఈ నెల ఆరో తేదీన తొలి దశ ఎన్నికలు జరిగాయని, సోమవారం నాటికి నాలుగు రోజులు పూర్తయినా ఆ వివరాలను ప్రకటించలేదని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇంతకుముందు ఎన్నికలయిన వెంటనే ఈ సమాచారం బహిర్గతమయిదేని గుర్తు చేశారు.

Updated Date - Nov 11 , 2025 | 02:15 AM