DA Hike: ఉద్యోగులకు దసరా, దీపావళి కానుక
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:54 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా, దీపావళి పండగలకు కానుక ఇచ్చింది. కరవు భత్యం (డీఏ)ను 3 శాతం పెంచింది....
డీఏ 3 శాతం పెంచిన కేంద్రం
దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా, దీపావళి పండగలకు కానుక ఇచ్చింది. కరవు భత్యం (డీఏ)ను 3 శాతం పెంచింది. ఈ పెంపు జూలై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డీఏను సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పింఛనుదారులకు ఈ కరవు భత్యాన్ని అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో డీఏను 2 శాతం పెంచారు. తాజాగా 3 శాతం పెంచడంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరనుంది. ఈ పెంపుతో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను అక్టోబరు నెల జీతంతో కలిపి దీపావళి కంటే ముందే అందిస్తామని వివరించారు. తాజా డీఏ పెంపు వల్ల కేంద్రంపై ఏటా అదనంగా రూ.10,083 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయా(కేవీ)లను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేవీలతో 86 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 57లో ఏడింటి ఖర్చును కేంద్ర హోం శాఖ భరిస్తుందని, మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని వివరించారు. కేవీల ఏర్పాటుకు రూ.5862.55 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఇప్పటి వరకు కేవీలు లేని జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత జిల్లాలు, కొండ పాలిత రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్త కేవీల్లో తెలంగాణ, ఏపీలకు నాలుగు చొప్పున కేటాయించారు. బయోమెడికల్ రిసెర్చ్ కెరీర్ ప్రోగ్రామ్ మూడో దశకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూ.1500 కోట్లతో 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.160 పెంచు తూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది గోధుమలకు ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2425 ఉండగా.. 2026-27 సీజన్‌కు దాన్ని రూ.2585కు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి కుసుమలకు ఎమ్మెస్పీ క్వింటాకు రూ.600, ఎర్ర కంది పప్పుకురూ.300, ఆవాలురూ.250, శనగలు 225, బార్లీకిరూ.170 చొప్పున పెంచినట్లు తెలిపారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ 150ఏళ్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు వైష్ణవ్ చెప్పారు.