Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:34 AM
ఎంతో ‘కొంత’ ముట్టజెప్పనిదే.. కొంతమంది అధికారులు పని చేయని పరిస్థితి! ఇలాంటి లంచగొండుల అమానవీయమైన ప్రవర్తన తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది.
కూతురు చనిపోయిన బాధలో కుటుంబం
అంబులెన్స్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు..
లంచాల కోసం అధికారుల వేధింపులు
బెంగళూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎంతో ‘కొంత’ ముట్టజెప్పనిదే.. కొంతమంది అధికారులు పని చేయని పరిస్థితి! ఇలాంటి లంచగొండుల అమానవీయమైన ప్రవర్తన తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురిని కోల్పోయి, పుట్టెడు దుఖఃంతో ఉన్న ఆ కుటుంబాన్ని అవినీతి జలగలు పీక్కుతిన్నాయి. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని బాధిత తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మా వద్ద డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇదే పరిస్థితి పేదలకు ఎదురైతే..’ అంటూ ఆయన ఎండగట్టడం వైరల్‌గా మారింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో కె.శివకుమార్ సీఎ్‌ఫఓగా పనిచేసి, రిటైర్డ్ అయ్యారు. ఆయన కూతురు అక్షయ (34) మెదడులో రక్తస్రావమై గతనెల 18న మృతిచెందింది. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర పనుల కోసం తాను వెళ్లిన ప్రభుత్వ కార్యాలయాలు, అక్కడ ఎదురైన ‘లంచాల’ అధికారుల గురించి బాధిత తండ్రి లింక్డ్‌ఇన్ పోస్టులో ప్రస్తావించారు. బెంగళూరు నగర పరిఽధిలోని బెళ్లందూరు పోలీసుస్టేషన్ సిబ్బంది, మహదేవపురలోని బీబీఎంపీ ఉద్యోగులు వేల రూపాయలు లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. ‘ఒక్కగానొక్క కూతురిని కోల్పోయాం. ఆవేదనలో ఉన్న మమ్మల్ని లంచాలు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ సిబ్బంది, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం, డెత్ సర్టిఫికెట్.. ఇలా ప్రతిచోటా లంచం లేకుండా పని జరగలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బెళ్లందూరు ఇన్‌స్పెక్టర్ తనపట్ల సానుభూతి చూపకుండా అత్యంత దురహంకారంతో వ్యవహరించారని పేర్కొన్నారు. శివకుమార్ పోస్టు చూసిన నెటిజన్లు లంచావతారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. పోస్టులో పేర్కొన్న ప్రతి ఉద్యోగిపైనా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కాళప్ప కోరారు.