Share News

Sydney Jewish Festival Shooting: ఆ ఉగ్రవాదులు పాకిస్థానీలే!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:23 AM

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఆదివారం కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు స్వయానా తండ్రీ కొడుకులని తేలింది.....

Sydney Jewish Festival Shooting: ఆ ఉగ్రవాదులు పాకిస్థానీలే!

  • ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి నిందితుల గుర్తింపు

  • తండ్రీ కొడుకులు సాజిద్‌, నవీద్‌ అని పోలీసుల వెల్లడి

సిడ్నీ, డిసెంబరు 15: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఆదివారం కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు స్వయానా తండ్రీ కొడుకులని తేలింది. ప్రఖ్యాత బోండీ బీచ్‌లో హన్నుకా వేడుకల్లో పాల్గొన్న యూదులపై జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు సాజిద్‌ అక్రమ్‌, నవీద్‌ అక్రమ్‌ అని.. వీరు తండ్రీ కొడుకులు అని న్యూసౌత్‌వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ మల్‌ లాన్యోన్‌ సోమవారం వెల్లడించారు. సాజిద్‌ అక్రమ్‌ 1998లో పాకిస్థాన్‌ నుంచి విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు ఆస్ట్రేలియా హోంమంత్రి టోనీ బర్కీ వివరించారు. నవీద్‌ అక్రమ్‌ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. సాజిద్‌ స్థానికంగా పండ్ల దుకాణం నడుపుతున్నాడని తెలిపారు. ఈ తండ్రీ కొడుకుల కాల్పుల్లో ఘటనా స్థలంలోనే 12 మంది మర ణించగా, గాయపడిన మరో ముగ్గురు ఆ తర్వాత మరణించగటంతో మృతుల సంఖ్య 15కు పెరిగింది. పోలీసుల కాల్పుల్లో సాజిద్‌ కూడా మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 16 అయ్యింది. 1996లో పోర్ట్‌ ఆర్థర్‌లో పర్యాటకులపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని పోలీసులు వెల్లడించారు. బోండీ బీచ్‌ కాల్పుల ఘటనకు పోలీసుల అలసత్వం కూడా ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది నవీద్‌ను ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా అనుమానించి 2019లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించకపోవటంతో వదిలేసి, అతడిపై సాధారణ నిఘా పెట్టారు. దీంతో ఇన్నాళ్లు మంచివాడిగా నటించిన అతడు.. సమయం చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నవీద్‌ పనిచేసిన కంపెనీ ఇటీవలే మూతపడటంతో రెండు నెలల క్రితమే అతడు ఉద్యోగం కోల్పోయినట్లు ఆ దేశ మీడియా రిపోర్టు చేసింది. యూదులు 8 రోజులపాటు నిర్వహించుకునే హన్నుకా వేడుకల చివరి రోజు ఛనుకా వేడుక సందర్భంగా బీచ్‌లోని ఓ పార్కులో దాదాపు 1,000 మంది పాల్గొన్నారు. ఇదే అదనుగా తండ్రీ కొడుకులు కాల్పులకు తెగబడ్డారు. సాజిద్‌ పదేళ్ల క్రితమే గన్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.


నేను చనిపోతే.. నా కుటుంబాన్ని చూసుకో..

యూదుల పై కాల్పులు జరిపిన ఒక ఉగ్రవాదిని ఉత్త చేతులతో నిలువరించిన అహ్మద్‌ను ఆస్ట్రేలియన్లు హీరోగా కొనియాడుతున్నారు. అతడు ఉగ్రవాదిని అడ్డుకుంటున్న వీడియోను ఆ దేశ మీడియా ప్రధానంగా ప్రసారం చేస్తోంది. కాల్పులు జరుగుతున్న సమయంలో అహ్మద్‌ సమీపంలోనే ఓ షాపులో తన బంధువుతో కలిసి ఉన్నాడు. ఉగ్రవాదిని చూడగానే.. ‘నేను అత డిని అడ్డుకోవటానికి వెళ్తున్నా.. నాకు ఏమైనా అయినా, చనిపోయినా.. నా కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి’ అని అతడికి చెప్పి ఉగ్రవాది వైపు పరుగెత్తాడని అహ్మద్‌కు వరుసకు సోదరుడయ్యే ముస్తఫా అనే వ్యక్తి ఆస్ట్రేలియా మీడియాకు వివరించాడు. అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ కూడా నిజమైన హీరో అని కొనియాడారు. ఉగ్రవాదిని అడ్డుకొనే క్రమంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్‌ కోసం సోషల్‌ మీడియాలో విరాళాల కోసం పిలుపునివ్వగా ఒక్కరోజులోనే 1.33 లక్షల డాలర్లు (రూ.1.20 కోట్లకు పైచిలుకు) వచ్చాయి. కాగా, ముందుగా ప్రచారమైనట్లు అహ్మద్‌ పండ్ల దుకాణం నడపటం లేదని, పొగాకు ఉత్పత్తులు విక్రయించే ప్రత్యేక కన్వీనియన్స్‌ స్టోర్‌ నడుపుతున్నట్లు తేలింది. అతడు సిరియా నుంచి వచ్చి ఇక్కడ కుటుంబంతో జీవిస్తున్నాడు.

Updated Date - Dec 16 , 2025 | 05:23 AM