Omar Farooqui: మా అన్న నిరపరాధి
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:17 AM
ఉగ్రవాద ఆరోపణలతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్....
ఎవరో ట్రాప్ చేసి ఇరికించారు
ఉగ్రవాది మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖీ ఆరోపణ
గుజరాత్ ఏటీఎస్ పోలీసుల అదుపులో మొహియుద్దీన్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్/ శంషాబాద్ రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద ఆరోపణలతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ నిరపరాధి అని అతడి సోదరుడు ఒమర్ ఫారూఖీ తెలిపారు. చార్మినార్ రెహమానియా మదర్సాలో మౌలనాగా పనిచేస్తున్న ఫారూఖీ మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎవరో కావాలనే తన అన్నను కుట్రలో ఇరికించారని ఆరోపించారు. ‘మా అన్న ఎంతో మంచివాడు.. నిరపరాధి.. చైనాలో డాక్టర్ చదివాడు.. కొవిడ్ సమయంలో ఎంతో మందికి సహాయం చేశాడు. దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి కాదు.. ఎక్కడో ఏదో జరిగింది.. ఎవరో మా అన్నను ట్రాప్ చేసి ఇరికించారు.. ఉగ్రవాదిగా చిత్రీకరించారు’ అని పేర్కొన్నారు. ఏటీఎస్ పోలీసులు ఆదివారం మొహియుద్దీన్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీమ్‌లను బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు..
మీడియాతోపాటు ఎవరితోనూ మాట్లాడవద్దని ఏటీఎస్ పోలీసులు తమను ఆదేశించారని చెప్పిన ఫారూఖీ.. తర్వాత తమ కుటుంబ వివరాలను వెల్లడించారు. తమ కుటుంబం 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం, టోలిచౌకి, రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లి ఫోర్ట్‌వ్యూ కాలనీలో నివాసం ఉందని చెప్పారు. ఫోర్ట్‌వ్యూ కాలనీలోని అసద్ మంజిల్‌లో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నట్లు తెలిపారు. ‘మాది ఖమ్మం.. మా నాన్న దివంగత డాక్టర్ అబ్దుల్ ఖాదర్ జిలానీ. అమ్మ అస్ర తఫజ్జుల్. మేము ఆరుగురం సంతానం. డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ పెద్దవాడు. ఆయన 2007 నుంచి 2013 వరకు చైనాలో మెడిసిన్ చదివాడు. అనంతరం వివిధ ఆసుపత్రులలో ఉద్యోగం చేశాడు. కొవిడ్ సమయంలో ఎంతో మందికి వైద్యం అందించాడు. ఎవరైనాకష్టాల్లో ఉంటే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది. 2021లో పెళ్లైంది. భార్యతో విడాకులూ అయ్యాయి. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లి కొంత కాలం జాబ్ చేశాడు’ అని వివరించారు.
టెలిగ్రాంలో ఉగ్ర సందేశాలు
అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ రెక్కీ చేశాడనే అంశంపైౖ దర్యాప్తు సంస్ధలు దృష్టి సారించాయి. ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రెసిన్ విషపదార్థాన్ని తయారు చేసిన మొహియుద్దీన్, దానిని వాడటం కోసం కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నగరంలోని మంచినీటి వ్యవస్థ, దేవాలయాల్లోని ప్రసాదాల్లో వాడే నీటిలో ఈ రెసిన్ కలపాలని మొహియుద్దీన్ కు ఆదేశాలు అందినట్లు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని మొహియుద్దీన్ హ్యండ్లర్ అయిన అబూ ఖదీజా టెలిగ్రాం యాప్ ద్వారా సందేశాలు పంపాడని, ఇదే మాడ్యూల్‌కు చెందిన ఢిల్లీ పేలుడు అనుమానితులు కూడా సంభాషణలు జరిపారని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొహియుద్దీన్ ఎక్కడెక్కడ తిరిగాడనే విషయాన్ని గుర్తించడానికి నిఘా బృందాలు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నాయి. మొహియుద్దీన్ తన ఫోన్‌లో గూగుల్ లోకేషన్‌ను ఆఫ్ చేసుకున్నాడని, సహచరులతో టెలిగ్రాం యాప్ ద్వారానే మాట్లాడేవాడని గుర్తించారు. రెసిన్ తయారీకి కావాల్సిన ల్యాబొరేటరీని ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు కనిపెట్టారు. కాగా, ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండో రోజు మంగళవారం కూడా హై అలర్ట్ కొనసాగింది. అనుమానితులు కనిపిస్తే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బిజినెస్ డీల్ ఉందని వెళ్లాడు
ఈ నెల 5వ తేదీన బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి మొహియుద్దీన్ బయటకు వెళ్లాడని ఫారూఖీ తెలిపారు. ‘9న ఏటీఎస్ పోలీసులు నాకు ఫోన్ చేసి మీ అన్నకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. దాంతో అందరం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి మా అన్నయ్యను కాపాడాలి’ అని వేడుకున్నారు. మొహియుద్దీన్ గదిలో ఉన్న సామగ్రిని తీయవద్దని, రెండు రోజుల్లో వచ్చి వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏటీఎస్ పోలీసులు చెప్పినట్లు ఫారూఖీ వెల్లడించారు. అసద్ మంజిల్‌కు వాచ్‌మెన్‌గా ఉన్న షబానాను విచారించగా తాను నాలుగు నెలల నుంచే వాచ్‌మెన్‌గా ఉన్నట్లు తెలిపింది. ఫోర్ట్‌వ్యూ కాలనీ వాసులు మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.