Brain Inflammation: ఆ 14 మంది చిన్నారుల మృతికి మెదడువాపు వ్యాధే కారణమా?
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:53 AM
ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలోని ఆస్పత్రుల్లో చేరిన 15 ఏళ్లలోపు చిన్నారుల్లో 14 మంది మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశమైంది....
తీవ్ర జ్వరం, కిడ్నీల వైఫల్యంతో మరణాలు
ఏఈఎ్‌సగా అనుమానిస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలోని ఆస్పత్రుల్లో చేరిన 15 ఏళ్లలోపు చిన్నారుల్లో 14 మంది మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశమైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కొందరు స్పృహ కోల్పోయారు. చాలామందికి కిడ్నీలు ఫెయిలయ్యాయి. దీంతో వారిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో చింద్వారాలోని గ్రామీణ ప్రాంతమైన పరాసియా నుంచి వచ్చిన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా 3 నుంచి 10 ఏళ్లలోపు వారే. కాగా, ఈ మరణాలకు అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న ఆరోగ్యశాఖ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. మెదడు అకస్మాత్తుగా వాపునకు గురైనప్పుడు లేదా పనిచేయడం ఆగిపోయినప్పుడు ఏఈఎ్‌సగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఈ తరహా మరిన్ని కేసులు వెలుగు చూస్తుండడంతో జాతీయ బృందాలు రంగంలోకి దిగాయి. చింద్వారా ప్రాంతాన్ని ప్రస్తుతం హై అలర్ట్ జోన్‌గా ప్రకటించారు. కాగా, బాధితులకు నిర్వహించిన సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (సీఎ్‌సఎఫ్), రక్త పరీక్షల్లో ఏఈఎ్‌సకు కారణయ్యే బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమీ కనిపించలేదు. దీంతో జ్వరాల వ్యాప్తికి సరైన కారణాన్ని నిర్ధారించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణె), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) బృందాలను ఇక్కడకు పంపారు.