Share News

Bihar Assembly Elections: బిహార్‌లో ఎన్డీయేదే గెలుపు

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:10 AM

బిహార్‌లో అధికార పీఠం మళ్లీ ఎన్డీయేదేనని మరో రెండు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. రెండో విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే మంగళవారం సాయంత్రం 9 ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలవగా..

Bihar Assembly Elections: బిహార్‌లో ఎన్డీయేదే గెలుపు

  • మరో 2 ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో అధికార పీఠం మళ్లీ ఎన్డీయేదేనని మరో రెండు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. రెండో విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే మంగళవారం సాయంత్రం 9 ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలవగా.. అన్నీ ఎన్డీయేదే గెలుపు అని పేర్కొన్నాయి. అధికార కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ (ఎంజీబీ)కి 100లోపే వస్తాయని అంచనా వేశాయి. అయితే, బుధవారం మరో రెండు సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలయ్యాయి. టుడేస్‌ చాణక్య సంస్థ ఎన్డీయేకు భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేయగా.. యాక్సిస్‌ మై ఇండియా మాత్రం బొటాబొటి మెజారిటీ వస్తుందని పేర్కొనడం గమనార్హం. ఎంజీబీపై ఎన్డీయే ఆధిపత్యం ప్రదర్శిస్తుందన్న యాక్సిస్‌ మై ఇండియా.. 75-76 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పడం విశేషం. ఎన్డీయేకు 121-141 సీట్లు వస్తాయని.. ఎంజీబీకి 98-118 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీకి 0-2 సీట్లు వస్తాయంది. టుడేస్‌ చాణక్య మాత్రం ఎన్డీయేకు 160 సీట్లు వస్తాయని, ఎంజీబీ 77 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. మొత్తం మీద 10 ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీయేకు అధికారం ఖాయమని వెల్లడించగా.. ఒక్క ఎగ్జిట్‌పోల్‌ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య కంటే ఒక సీటు తక్కువ (121) వచ్చే అవకాశం ఉందని తెలిపింది. బిహార్‌లో బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, వైశ్యులు, ఎస్సీలు, యాదవేతర ఓబీసీలు, అత్యంత వెనకబడిన వర్గాలు ఎక్కువగా ఎన్డీయే వైపే మొగ్గు చూపినట్లు టుడేస్‌ చాణక్య విశ్లేషణలో తేల్చింది. ఎన్డీయేకు దాదాపు 44 శాతం ఓట్లు, ఎంజీబీకి 38 శాతం, ఇతరులకు 18 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. అయితే బిహార్‌లో ఎన్డీయే అధికారంలోకి రాదని, నితీశ్‌కు మళ్లీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Updated Date - Nov 13 , 2025 | 04:10 AM