Breast Health: బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే..కసరత్తు బెస్ట్
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:34 AM
తిన్న చోటే బద్ధకంగా కూర్చోకుండా.. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది....
నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్‌మీట్,ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు
మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో, 30 ఏళ్లు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం
భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి
ఏటా 5.6ు మేర కేసులు పెరుగుతాయని హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిన్న చోటే బద్ధకంగా కూర్చోకుండా.. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిద్ర లేమి, రోజూ నిర్ణీత సమయానికి నిద్ర పోక పోవడం, ఒత్తిడి స్థాయులు పెరగడం, నాన్‌వెజ్ అధికంగా తినడం రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతాయని వెల్లడించింది. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా 5.6 శాతం మేర పెరిగే ప్రమాదం ఉందని.. ప్రతి సంవత్సరం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 50 వేలకు పైగా ఎక్కువ కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. మనదేశానికే ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలను పరిశీలించి, భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా కారణమయ్యే అంశాలను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్‌కు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ (బెంగళూరు)’ చేపట్టిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. వైద్య, ఆరోగ్య పరిశోధన పత్రాలను భద్రపరిచే పబ్‌మెడ్, స్కోపస్, ఎంబేస్ వంటి అంతర్జాతీయ డేటాబే్‌సలలో 2024 డిసెంబరు 22 దాకా అందుబాటులో ఉన్న 1871 వ్యాసాలు, 31 అధ్యయనాల సమాచారాన్ని ఆ సంస్థ నిపుణులు విశ్లేషించి ఒక పరిశోధన పత్రాన్ని రూపొందించారు. ‘‘అండర్‌స్టాండింగ్ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇన్ ద ఇండియన్ పాపులేషన్: ఎవిడెన్స్ ఫ్రమ్ ఏ సిస్టమేటిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్’’ పేరిట ప్రచురించిన ఆ పరిశోధన పత్రం ప్రకారం.. మెనోపాజ్ ఆలస్యం అయ్యే (50 ఏళ్లు దాటాక) మహిళల్లో, 30 ఏళ్లు దాటాక తొలిసారి గర్భం ధరించే మహిళలకు, గర్భస్రావాలు ఎక్కువగా అయినవారికి, యుక్తవయసులో కాకుండా ఆలస్యంగా వివాహం చేసుకునేవారికి, నడుము- నడుము కింది భాగం చుట్టుకొలత నిష్పత్తి (వెయిస్ట్ టు హిప్ రేషియో) 0.85 కన్నా ఎక్కువగా (పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా) ఉండేవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని వెల్లడైంది.
అలాగే.. కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా క్యాన్సర్.. మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రోగులు ఉంటే కూడా ఆ కుటుంబంలోని మహిళలకు ఈ ముప్పు ఎక్కువని ఐసీఎంఆర్ వైద్యనిపుణులు పేర్కొన్నారు. విదేశాల్లో.. 35-50 ఏళ్ల వారితో పోలిస్తే 50 ఏళ్లు దాటినవారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు మూడు రెట్లు ఎక్కువని.. మనదేశంలో అయితే 40-50 ఏళ్ల మహిళల్లోనే ఈ ముప్పు ఎక్కువగా ఉంటోందని తెలిపారు. దీంతోపాటు.. నిద్ర లేమి, నిర్ణీత నిద్రవేళలు పాటించకపోవడం, వెలుతురు ఎక్కువగా వచ్చే గదుల్లో నిద్రించడం, ఒత్తిడి స్థాయులు పెరగడం, నాన్‌వెజ్.. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం అధికంగా తినడం వంటి జీవనశైలి లోపాలు కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్టు వారి అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో.. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలో, వ్యాయామం చేసేవారిలో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు. వ్యాయామం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుందని.. అది రొమ్ము క్యాన్సర్ నుంచి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు.
ఇదీ లెక్క..
మనదేశంలో 2022లో 2,21,757 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాది క్యాన్సర్ బారిన పడిన మహిళల సంఖ్యలో ఇది ఏకంగా 22.8 శాతం. అంటే ప్రతి నలుగురు మహిళా క్యాన్సర్ పేషెంట్లలో దాదాపు ఒకరు రొమ్ము క్యాన్సర్ బాధితులే! ఏటా ఈ కేసుల సంఖ్య 5.6 శాతం మేర పెరుతుందని.. 2025లో 2,32,832 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చని ఐసీఎంఆర్ వైద్యనిపుణులు అంచనా వేశారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయడానికి 81 శాతం అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత దశలో 65.5ు, ఇతర అవయవాలకు వ్యాప్తి చెందితే కేవలం 18.3 శాతమే ఉంటుందని.. కాబట్టి ఈ మహమ్మారిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజారోగ్య విధానాలకు అత్యఽధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐసీఎంఆర్ సూచించింది. వ్యాయామాన్ని ప్రొత్సహించే చర్యలు తీసుకోవాలని, పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా నియంత్రించుకునే మార్గాలపై చైతన్యం కల్పించాలని, స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
అడ్డుకట్ట ఇలా..
రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి ‘నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్’ కొన్ని సూచనలు చేసింది.
మరీ మూడుపదుల వయసు దాటాక కాకుండా తగిన వయస్సులో గర్భం దాల్చడం. అసలు పిల్లలు పుట్టనివారితో, 35 ఏళ్లు దాటాక తొలిసారి గర్భం దాల్చినవారితో పోలిస్తే.. 20 ఏళ్లలోపే పిల్లలను కన్న మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువ.
ప్రసవం తర్వాత పిల్లలకు ఎక్కువకాలం పాలివ్వాలి.
మద్యం సేవించకూడదు.
బరువును అదుపులో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా.. మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోయిన) తరువాత బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. మెనోపాజ్‌కు ముందు మహిళల శరీరాల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా వారి అండాశయాల్లో తయారవుతుంది. రుతుక్రమం ఆగిపోయాక.. కొవ్వు కణాలు ఈస్ట్రోజన్‌ను తయారుచేస్తాయి. కొవ్వుకణాలు ఎంత ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజన్ స్థాయులు అంతగా పెరిగిపోతాయి. తద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
ఎక్కువ సేపు కూర్చుని ఉండకుండా యాక్టివ్‌గా ఉండాలి. నిత్యం వ్యాయామం, శారీరక శ్రమ చేయడం ఉత్తమం.
కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.