Share News

Former CJI Justice Gavai: కొన్నిసార్లు శిక్ష కన్న క్షమ మిన్న

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:09 AM

కోర్టులో తనపై బూటు విసిరిన సంఘటనను తాను పట్టించుకోలేదని, ప్రభావితం కాలేదని మాజీ సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. తాను హిందువుల మనోభావాలను దెబ్బ....

Former CJI Justice Gavai: కొన్నిసార్లు శిక్ష కన్న క్షమ మిన్న

  • బూటు విసిరిన ఘటనను పట్టించుకోలేదు

  • హిందువులను కించపరచడమన్న ప్రశ్నే లేదు: మాజీ సీజేఐ జస్టిస్‌ గవాయ్‌

న్యూఢిల్లీ, నవంబరు 25: కోర్టులో తనపై బూటు విసిరిన సంఘటనను తాను పట్టించుకోలేదని, ప్రభావితం కాలేదని మాజీ సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. తాను హిందువుల మనోభావాలను దెబ్బ తీశానన్న ప్రశ్నే తలెత్తదని చెప్పారు. పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లో ఓ విష్ణు విగ్రహం పునరుద్ధరణకు సంబంఽధించిన కేసు విచారణ సందర్భంగా ‘పోయి, దేవుడికే చెప్పుకోండి’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని నిరసన తెలుపుతూ కోర్టులో ఒకరు ఆయనపై బూటు విసిరారు. దీనిపై అడిగిన ప్రశ్నకు గవాయ్‌ సమాధానం ఇస్తూ ‘నేను హిందువుల మనోభావాలను కించపరిచానన్న ప్రశ్నే లేదు. నేను గుడులు, దర్గాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు అన్నింటికీ వెళ్తాను. అన్ని మతాలనూ అమితంగా గౌరవిస్తాను’ అని చెప్పారు. ఆ నిర్ణయం ఆ క్షణంలో తీసుకున్నదే తప్ప ముందుగా అనుకొని చేసినది కాదని అన్నారు. బూటు విసిరన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడలేదని చెప్పారు. కొన్ని సార్లు శిక్షించడం కన్నా క్షమించడం మంచిదని అన్నారు. వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరమని ఈ సంఘటన రుజువు చేసిందని చెప్పారు. రిటైర్మెంట్‌ అయిన తరువాత ప్రభుత్వ పదవులు చేపట్టకూడదని బాధ్యతలు స్వీకరించిన రోజునే అనుకున్నానని చెప్పారు. దానికి కట్టుబడి ఉంటానన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 04:09 AM