Share News

Supreme Court: డిజిటల్‌ యాక్సెస్‌ ప్రాథమిక హక్కు

ABN , Publish Date - May 01 , 2025 | 05:24 AM

డిజిటల్‌ యాక్సెస్‌ ఓ ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు ప్రకటించింది. యాసిడ్‌ దాడి బాధితురాలు ప్రజ్ఞ ప్రసూన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా, కోర్టు కేవైసీ ప్రక్రియలో మార్పులు చేసేందుకు 20 మార్గదర్శకాలు విడుదల చేసింది.

Supreme Court: డిజిటల్‌ యాక్సెస్‌ ప్రాథమిక హక్కు

సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: డిజిటల్‌ యాక్సెస్‌ ఓ ప్రాథమిక హక్కు అని, ప్రజలందరికీ దానిని ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికైనా, సమాజంలో వెనుకబాటుకు గురవుతున్న వర్గాల వారికైనా సమానంగా డిజిటల్‌ సేవలు అందాల్సిందేనని పేర్కొంది. రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్‌)ను విచారించిన జస్టిస్‌ పార్థీవాలా, జస్టిస్‌ ఆర్‌.మాధవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పును బుధవారం వెలువరించింది. డిజిటల్‌ అంతరాలను తగ్గించడం ఇక ఎంతమాత్రం విధానపరమైన విచక్షణకు సంబంధించిన అంశం కాదని, గౌరవప్రదంగా జీవించే హక్కును పరిరక్షించేందుకు రాజ్యాంగపరమైన ఆవశ్యకత ఉన్న అంశంగా మారిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర సేవలు, పాలన, విద్య, ఆరోగ్య భద్రత, ఆర్థిక అవకాశాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే హక్కును పునర్నిర్వచించి ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది.


అసమానలతో కూడిన డిజిటల్‌ పరికరాలు, నైపుణ్యం, కంటెంట్‌ ద్వారా డిజిటల్‌ విభజన కొనసాగుతోంది’’ అని కోర్టు పేర్కొంది. కోర్టు విచారించిన రెండు పిల్స్‌లో ఒకటి యాసిడ్‌ దాడి బాధితురాలు ప్రజ్ఞ ప్రసూన్‌ దాఖలు చేశారు. ఓ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) సమర్పణలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. యాసిడ్‌ దాడిలో తన ముఖం ఆకృతి మారిపోవడంతో పాటు, కళ్లకు కూడా చాలా నష్టం కలగడంతో కనురెప్పలను మూయలేక బ్యాంకులో లైవ్‌ కేవైసీ పూర్తి చేయలేకపోయానని ఆమె వాపోయారు. తనలాంటి యాసిడ్‌ దాడి బాధితుల విషయంలో కేవైసీ పూర్తి చేయడానికి కేంద్రానికి తగిన మార్గదర్శకాలు జారీచేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా కేవైసీ విధివిధానాలను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం స్పష్టం చేస్తూ 20 మార్గదర్శకాలను జారీ చేసింది.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:24 AM