Share News

Pension Hike: కనీస పింఛన్‌ రూ.2500!

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:47 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎ్‌ఫవో త్వరలోనే ఈపీఎ్‌ఫ చందాదారులకు శుభవార్త చెప్పనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి....

Pension Hike: కనీస పింఛన్‌ రూ.2500!

  • 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు

  • 10న ఈపీఎఫ్‌వో ట్రస్టీల భేటీలో నిర్ణయం!

  • 7,500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు

  • 10 ఏళ్ల రెగ్యులర్‌ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు పింఛన్‌కు అర్హులు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో) త్వరలోనే ఈపీఎ్‌ఫ చందాదారులకు శుభవార్త చెప్పనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 11 ఏళ్ల సుదీర్ఘ వేచిచూపుల అనంతరం పింఛను మొత్తాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌-95) కింద నెలవారీ రూ.1000 పింఛన్‌ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని 2014లో నిర్ణయించారు. అయితే, దీన్ని రూ.7500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత 11ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా ఉన్న కనీస నెలవారీ పింఛన్‌ను పెంచే అంశంపై ఈపీఎ్‌ఫవో చర్చలు జరుపుతోంది. నెలవారీ పింఛన్‌ను రూ.2500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనున్న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో పింఛను పెంపుతోపాటు సేవలను డిజిటలీకరణ చేసే ఈపీఎ్‌ఫవో 3.0 విధానం, పరిపాలనా సంస్కరణలపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలు పింఛన్‌ను రూ.7500కు పెంచాలని డిమాండ్‌ చేస్తుండగా.. ఈపీఎ్‌ఫవో రూ.2500 చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు సమావేశం లో పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటే, దానికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కనీసం పదేళ్లపాటు రెగ్యులర్‌ సర్వీస్‌ పూర్తి చేసుకోవడంతో పాటు 58 ఏళ్లు నిండిన వారు ఈపీఎస్‌ కింద నెలవారీ పింఛనుకు అర్హులు.

Updated Date - Oct 08 , 2025 | 07:21 AM