EPFO: ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ లైట్
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:15 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎ్‌ఫవో తన చందాదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాస్‌బుక్ లైట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ సదుపాయంతో ఉద్యోగులు.....
ఇక ఉద్యోగుల భవిష్యనిధి సేవలన్నింటికీ ఒకే లాగిన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో) తన చందాదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పాస్‌బుక్ లైట్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ సదుపాయంతో ఉద్యోగులు ఈపీఎ్‌ఫవో సేవలన్నీ ఒకే లాగిన్ ఐడీ ద్వారా సులభంగా పొందవచ్చు. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న లాగిన్‌లను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. దీనివల్ల 7 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవడానికి, లావాదేవీలను చూసుకోవడానికి, అడ్వాన్సు తీసుకోవడానికి, డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి సభ్యులు పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా సభ్యులు మెంబర్ పోర్టల్‌లో పొందుపరిచిన ‘పాస్‌బుక్ లైట్’ ద్వారా ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఇందు కోసం మెంబర్ పోర్టల్‌లోనే లింకు ఉంటుంది. దీనిద్వారా పాస్‌బుక్ వివరాలను సులభంగా పొందవచ్చు. పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ కావాల్సిన అవసరం లేదు. అయితే గ్రాఫిక్ వివరాలతో ఉండే పాస్‌బుక్ కోసం మాత్రం ప్రస్తుతమున్న పోర్టల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారి పీఎఫ్‌ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను ఇక నుంచి ఆన్‌లైన్ (ఎనెక్సర్ కే)లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం మారిన సభ్యుడి పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో ఫాం-13 ద్వారా మారుస్తున్నారు. అది మారాక.. పాత పీఎఫ్ కార్యాలయం ఎనెక్సర్ కేను రూపొందించి, కొత్త కార్యాలయానికి పంపుతోంది. ఒకవేళ సభ్యుడు ఆ ధ్రువీకరణ పత్రం కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో ఆ అవసరం లేదు. ఎనెక్సర్ కేను మెంబర్ పోర్టల్ నుంచి సభ్యుడే నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త సంస్కరణల వల్ల పీఎఫ్ బదిలీలు, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్లు, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి మాండవీయ చెప్పారు. ప్రస్తుతం ఈ అనుమతులను ప్రాంతీయ పీఎఫ్ కమిషనరు గానీ, ఆఫీస్ ఇన్‌చార్జి గానీ ఇచ్చేవారని, ఇకపై ఈ అధికారాలను సహాయ కమిషనర్లు, కింది స్థాయి అధికారులకు బదిలీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.