Pending Payments: ఉపాధి వేతనాలు భారీగా పెండింగ్
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:38 AM
జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో వేతనాలు భారీగా పెండింగ్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 1,340 కోట్లు బకాయిలు ఉంటే..
దేశ వ్యాప్తంగా రూ. 1,340 కోట్ల బకాయిలు
నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధికం.. పెండింగ్‌లో తొలి స్థానంలో ఏపీ
తర్వాత స్థానాల్లో కేరళ, తమిళనాడు, ఎంపీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డేటా వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 13: జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో వేతనాలు భారీగా పెండింగ్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 1,340 కోట్లు బకాయిలు ఉంటే.. దీనిలో కేవలం నాలుగు రాష్ట్రాలే సుమారు రూ. 1,095 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ మొత్తంలో దాదాపు 80 శాతం ఆ నాలుగు రాష్ట్రాల్లోనే ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డేటా వెల్లడించింది. ఆ డేటా ప్రకారం.. డిసెంబరు 5 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రూ. 402.93 కోట్లు, కేరళలో 339.87 కోట్లు, తమిళనాడులో రూ. 220.13 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ. 131 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఏసాఫ్ట్ డేటా ప్రకారం ఉపాధి హామీ పథకం కింద దేశంలో మొత్తం 27.64 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 12.16 కోట్ల మంది డిసెంబరు 1 నాటికి క్రియాశీలంగా ఉన్నారు. ఏపీలో మొత్తం 1.1 కోట్ల మంది ఉపాధి కార్మికులు రిజిస్టర్ అయి ఉండగా వారిలో 90.54 శాతం మంది క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ఆరో స్థానంలో ఉంది. కానీ, పెండింగ్ వేతనాలు చూస్తే దేశం మొత్తంలో 30 శాతం ఏపీలోనే ఉన్నాయి. ఇక కేరళలో 58.03 మంది ఉపాధి కార్మికులు ఉండగా.. 25 శాతం వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక పెద్ద రాష్ట్రాలు, కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పెండింగ్ శాతం తక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 2.34 కోట్ల మంది కార్మికులు రిజిస్టర్ అయ్యారు. వారిలో 1.2 కోట్ల మంది క్రియాశీలంగా పనిచేస్తున్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న వేతనాల్లో ఈ రాష్ట్ర వాటా 2.5 శాతంగా మాత్రమే ఉంది. రాజస్థాన్‌లో 2.33 కోట్ల మంది కార్మికులు రిజిస్టర్ అయి ఉండగా.. జాతీయ స్థాయి పెండింగ్‌లో ఆ రాష్ట్ర వాటా కేవలం 0.38 శాతంగా ఉండటం విశేషం.
ఉపాధి హామీ పథకంలో పని దినాల కల్పన, వేతనాల మంజూరు నిరంతరం జరిగే ప్రక్రియ. డీబీటీ ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేతనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (పీఎ్‌ఫఎంఎస్) రాష్ట్రాల నుంచి వచ్చిన ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆధారంగా ఆ నిధులను రోజువారీగా విడుదల చేస్తుంది. నవంబరు నెలాఖరుకు రూ. 68,393.67 కోట్లను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం విడుదల చేసింది. కార్మికుల హాజరు, బ్యాంకు ఖాతాలకు మధ్య ఇబ్బందులు ఉంటే నగదు జమ పెండింగ్‌లో ఉండిపోతుంది.