Share News

IndiGo Flight Crisis: కావాలనే సంక్షోభం?

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:25 AM

దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కావాలనే సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సారం చేశారా? నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా.....

IndiGo Flight Crisis: కావాలనే సంక్షోభం?

  • ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు

  • సంక్షోభానికి కారకులు బాగానే ఉన్నారు

  • ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులేమో ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు

  • డీజీసీఏ నిబంధనలు అమల్లోకి రాగానే విమాన సర్వీసులు రద్దవడమేంటి?

  • ఉద్యోగుల బాధ్యత లేదని ప్రకటించాలి

  • లేఖలో ఇండిగో సిబ్బంది డిమాండ్‌

  • డీజీసీఏ నిబంధనల అమలుకు వ్యవధి ఇచ్చినా ఏర్పాట్లు చేసుకోని ఇండిగో!

  • దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం

  • ఫిబ్రవరి 10 దాకా ఇండిగోకు తాత్కాలికంగా నిబంధనల సడలింపు

  • 15 రోజులకోసారి సమీక్ష

  • తప్పంతా ఇండిగోదే.. చర్యలు తప్పవు

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

  • తాజాగా వెయ్యికి పైగా విమానాల రద్దు

న్యూఢిల్లీ, డిసెంబరు 5: దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కావాలనే సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సారం చేశారా? నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే విమాన సర్వీసుల రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలిం పు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది, గ్రౌండ్‌ స్టాఫ్‌ సహా ఇండిగో సిబ్బంది సంతకాలు చేసి, రాసినట్లుగా పేర్కొంటున్న ఓ బహిరంగ లేఖ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ లేఖ వైరల్‌గా మారింది. ఈ సంక్షోభానికి కారణం కేవలం నిర్వహణలో వైఫల్యం కాదని.. ప్రణాళికలు, ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల రక్షణలో వైఫల్యమని ఇండిగో సిబ్బంది లేఖలో పేర్కొన్నారు. సంక్షోభానికి కారణమైన నిర్ణయాలు తీసుకున్న వారంతా తాజా పరిణామాలకు దూరం గా ఉన్నారని.. ఇందుకు సంబంధంలేని ఉద్యోగులు మాత్రం ప్రయాణికుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారని వాపోయారు. డీజీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలోనే భారీగా విమాన సర్వీసులు రద్దవడం యాదృచ్ఛికం కాదని.. దీని వెనకున్న కారణాలను విస్మరించరాదన్నారు. సంక్షోభాన్ని సృష్టించి, డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణా వైఫల్యం జరిగినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిని వాడుకొని, వారి సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. డీజీసీఏ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లుగా ఉందని.. ఈ విషయంలో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది తప్పేంలేదని ప్రయాణికులకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతంకాకుండా చూడాలన్నారు.


డీజీసీఏ కీలక నిర్ణయం

ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా పైలట్ల వారాంతపు విశ్రాంతి (వీక్లీ రెస్ట్‌) నిబంధనలో మార్పులు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. వందలాది సర్వీసుల రద్దుతో సతమతమవుతున్న ఇండిగో.. నిబంధనలు సడలించాలంటూ డీజీసీఏను ఆశ్రయించిం ది. ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ (ఎఫ్‌డీ టీఎల్‌) నుంచి ఉపశమనం కల్పించాలని కోరిం ది. దీంతో పైలట్ల విధులకు సంబంధించి తాజా మార్పు లు చేపట్టింది. ఇవి తాత్కాలికం మాత్రమేనని పేర్కొంది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36గంటల నుంచి 48గంటలకు పెంచగా ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతకుముందు, డీజీసీఏ కొత్త నిబంధనల ప్రకారం..వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్‌ పీరియడ్‌, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్య పరిష్కారానికి ఈ కఠిన నిబంధనలు తెచ్చారు. కానీ, ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఈ నిబంధనను కాస్త సడలించారు. ఇక, పైలట్ల రాత్రి విధులపై ఉన్న నిబంధనల విషయంలో డీజీసీఏ.. ఇండిగోకు భారీ ఉపశమనం కల్పించింది. పైలట్లు వరసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్ట్‌లు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఇండిగో పైలట్లు వారంలో ఆరు నైట్‌ డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుత గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఫిబ్రవరి 10వరకు అమల్లో ఉంటాయని, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఇండిగో వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. పరిస్థితులను సమీక్షించేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విమానాల రాకపోకల్లో అంతరాయాలకు కారణాలను గుర్తించడం, ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలనుగుణంగా మానవ వనరుల సర్దుబాటు, రోస్టర్‌ను తయారు చేస్తున్నారా?లేదా? అన్నది పరిశీలించడం వంటి పనులు చేయాలి. 15 రోజుల్లోగా డీజీసీఏకు నివేదికను సమర్పించాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.


ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: రామ్మోహన్‌

ఇండిగో సంక్షోభం అతి త్వరలోనే సమసిపోతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఇండిగో విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు. ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను దేశంలోని విమానయాన సంస్థలన్నీ అమలు చేస్తున్నాయని, వాటికెలాంటి ఇబ్బందులూ లేవని.. ఒక్క ఇండిగోలోనే సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు. తప్పంతా ఇండిగో యాజమాన్యానిదేనన్నారు. ‘‘సంస్థపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు మెరుగైన సేవలందేలా చూడడం మా విధి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతా మాదే. దర్యాప్తు అనంతరం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’అని రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. కాగా ఇండిగోకు ఊరట కల్పించేందుకు డీజీసీఏ నిబంధనలను సడలించడంపై పైలట్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని పేర్కొన్నాయి.

కాగా ఇండిగో సంక్షోభం కారణంగా నాలుగో రోజూ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. శుక్రవారం ఇండిగో వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన అన్ని విమానాలూ (దాదాపు 235) రద్దయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయంతోపాటు దేశం లోని ప్రధాన నగరాల్లో ఇండిగో ప్రయాణికుల పరిస్థితి దారుణంగా మారింది. శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన 155 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి 104, బెంగళూరు నుంచి 102 విమానాలు రద్దయ్యాయి. కాగా ఈ నెల 10-15 నాటికి విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. శనివారం 1000కన్నా తక్కువ విమానాలే రద్దవుతాయని భావిస్తున్నామన్నారు.

భారీగా పైలట్ల కొరత..

దేశంలో విమాన పైలట్ల కొరత భారీగా ఉంది. డీజీసీఏ ప్రకారం 26,500 మంది లైసెన్స్‌డ్‌ పైలట్లు ఉన్నారు. కానీ, వీరిలో భారత్‌లో విమానయాన సంస్థల్లో పనిచేస్తున్నవారు 11,700 మందే. వేతనాలు ఎక్కువగా వస్తుండడంతో కొందరు విదేశాలకు వెళ్లారు. మరికొందరు వివిధ కారణాలతో క్రియాశీలంగా లేరు. ఇండిగోలో ఏ320 విమానాలను నడిపేందుకు 2422 మంది కెప్టెన్లు, 2153 మంది ఫస్ట్‌ ఆఫీసర్లు కావాల్సి ఉండగా.. 2357 మంది కెప్టెన్లే ఉన్నారు. ఫస్ట్‌ ఆఫీసర్లు మాత్రం 2,194 మంది ఉన్నారు. ఒక స్వల్పకాలిక నివేదిక ప్రకారం భారత్‌లోని విమానయాన సంస్థలకు 2030 నాటికి 22,400 మంది పైలట్లు కావాలి. కానీ, ప్రస్తుతం మనదేశంలో విధుల్లో ఉన్న లైసెన్స్‌డ్‌ పైలట్లు 11,700 మందే!

Updated Date - Dec 06 , 2025 | 04:25 AM