Nitin Gadkari: పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:41 AM
మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానం అవుతాయని కేంద్ర రోడ్డు....
మరో 4-6 నెలల్లో అందుబాటులోకి..
కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ, అక్టోబరు 7: మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానం అవుతాయని కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం దేశానికి ఆర్థికంగా పెను భారంగా మారుతోందని, ఏటా ఆ ఇంధనాల దిగుమతికి రూ.22 లక్షల కోట్ల వ్యయం అవుతోందన్నారు. పర్యావరణపరంగానూ శిలాజ ఇంధనాలు తీవ్ర సమస్యగా మారాయని.. ఈ నేపథ్యంలో, దేశ పురోగతికి కాలుష్య రహిత ఇంధనాల వాడకం కీలకమని గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ 20వ ఉన్నతవిద్యా సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మలచటం మన లక్ష్యమని గడ్కరీ ఉద్ఘాటించారు. తాను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.14 లక్షల కోట్లుగా ఉన్న దేశ వాహనరంగం ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. అమెరికా వాహనరంగం విలువ రూ.78 లక్షల కోట్లు కాగా, చైనా వాహనరంగం విలువ రూ.47 లక్షల కోట్లని తెలిపారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయటం ద్వారా రైతులు సగటున రూ.45 వేల చొప్పున అదనంగా సంపాదించుకున్నారని గడ్కరీ పేర్కొన్నారు. వేరుపరిచిన ఘన వ్యర్థాలను 2027 నాటికి రోడ్ల నిర్మాణంలో పూర్తిగా వినియోగించే పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. యువతే భారతదేశ ప్రధాన బలమని, వారికి తగిన నైపుణ్య శిక్షణ, విద్య అందిస్తే ప్రపంచంలో మనకు తిరుగు ఉండదని ఆయన చెప్పారు.