Election Commission Of India: ఓటు తొలగింపునకు ఈ వెరిఫికేషన్ తప్పనిసరి
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:47 AM
ఓటర్ల జాబితా నుంచి ఓటు తొలగింపు ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఓటర్ల జాబితా నుంచి ఓటు తొలగింపు ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఓటర్ ఐడీకి జత చేయబడిన మొబైల్‌కు ఓటీపీ పంపించడం ద్వారా ఓటును తొలగించడానికి అవకాశం ఉండేది. తాజా మార్పుతో ఈసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఓటు తొలగింపునకు ఫాం 7, కొత్త ఓటు కోసం ఫాం 6 దరఖాస్తు చేసినపుడు పాప్‌అప్ వస్తుంది. అది ఆధార్ వెరిఫికేషన్‌కు సూచనలు చేస్తుంది. అది పూర్తయిన తరువాత మాత్రమే తిరిగి ఈసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో దరఖాస్తు స్వీకరణ పూర్తి అవుతుంది. కర్ణాటకలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడానికి చాలా ముందుగానే... ఈ ఏడాది జూలై - ఆగస్టు నెలల్లోనే ఆ మేరకు సాంకేతిక మార్పులు చేసినట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పు రాహుల్ ఆరోపణలకు స్పందన ఎంత మాత్రం కాదని ఈసీ స్పష్టం చేసింది. ‘అళందలో ఓట్ల తొలగింపునకు 6,018 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందాయి. పరిశీలన అనంతరం కేవలం 24 మాత్రమే సరైనవని, మిగిలిన 5,994 దరఖాస్తులు తప్పుడివని తేలింది. వాటిని తిరస్కరించాం’ అని ఈసీ పేర్కొంది.