EVM Ballots: ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫొటోలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:19 AM
ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ ఎన్నికల నేపథ్యంలో..
ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఓటింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఐఆర్, ఓట్ల చోరీ వంటి ఆరోపణలవేళ ఎలక్షన్ కమిషన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎలక్ర్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థి ఫొటో స్పష్టంగా ఉండేలా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికల కమిషనర్లకు లేఖలు రాసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణలో స్పష్టత, అందరికీ కనిపించేలా, స్పష్టంగా చదవగలిగేలా మార్గదర్శకాలను సవరించినట్టు ఈసీఐ పేర్కొంది. నోటాతో సహా అభ్యర్థులందరి పేర్లు ఒకే రకమైన ఫాంట్‌లో ఓటర్లు సులభంగా చదవగలిగేలా తగినంత పెద్ద ఫాంట్ సైజులో ముద్రించనున్నట్లు స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల నుంచే రంగు ఫొటోలు, పెద్ద ఫాంట్‌తో ఈవీఎం బ్యాలెట్ పేపర్లకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపింది.
ప్రధాన మార్పులు ఇవే..
కలర్ ఫొటోలు: ఇకపై ఈవీఎం బ్యాలెట్ పత్రంపై అభ్యర్థుల ఫొటోలు నలుపు, తెలుపు రంగులో కాకుండా కలర్‌లో ప్రింట్ చేస్తారు. ఫొటోలో మూడు వంతుల భాగం అభ్యర్థి ముఖం స్పష్టంగా కనిపించేలా ముద్రిస్తారు.
పెద్ద సీరియల్ నంబర్లు: అభ్యర్థుల సీరియల్ నంబర్లు, నోటా గుర్తును పెద్దగా, స్పష్టంగా కనిపించేలా బోల్ ్డ అక్షరాలతో (30 ఫాంట్ సైజు) ముద్రిస్తారు.
ఒకే రకమైన ఫాంట్: అభ్యర్థులందరి పేర్లు, నోటా ఆప్షన్‌ను సులభంగా చదవగలిగేలా ఒకే రకమైన పెద్ద ఫాంట్‌లో ఉంటాయి.