Election Commission: దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రద్దు!
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:56 AM
ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై మరోసారి..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై మరోసారి చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గత ఆరేళ్లలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తొలి దశలో భాగంగా ఆగస్టు 9న 334 పార్టీలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ‘‘రెండో దశలో భాగంగా 474 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను ఈ నెల 18న జాబితా నుంచి తొలగించాం. గత ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో గత రెండు నెలల వ్యవధిలో మొత్తంగా 808 రాజకీయ పార్టీలను రద్దు చేశాం’’ అని ఈసీ శుక్రవారం తెలిపింది. ఇప్పటివరకు 2520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని తెలిపింది. అత్యధికంగా యూపీలో 121 పార్టీలను, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 42, ఢిల్లీలో 40, పంజాబ్‌లో 21, మధ్యప్రదేశ్‌లో 23, బిహార్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 17 పార్టీలను రద్దు చేసినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ఈసీ వెల్లడించింది.