MLA Veerendras: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర నివాసంపై మళ్లీ ఈడీ దాడులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:57 AM
చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పీ నివాసంపై ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు...
బెంగళూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పీ నివాసంపై ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. చెళ్లెకెరె నగరంలోని ఆయన నివాసంలో తనిఖీలు జరిపారు. బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ.55 కోట్లను జప్తు చేశారు. ఎమ్మెల్యే వీరేంద్ర అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించి, ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా బుధవారం మరోసారి దాడులు నిర్వహించారు. ఐదు విలాసవంతమైన కార్లను, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.55 కోట్లను జప్తు చేశారు. వీరేంద్రకు 9 బ్యాంకు ఖాతాలు, ఒక డీమ్యాట్ అకౌంట్, 262 మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. చెళ్లెకెరె నగరంలోని కొటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. వీరేంద్ర పప్పీతో పాటు ఆయన కుటుంబీకుల బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. వారికి ఎక్కడి నుంచి నగదు జమ అయ్యిం ది, ఏఏ ఖాతాలకు బదిలీ చేశారనే వివరాలను సేకరించారు. వీరేంద్ర తక్కువ సమయంలోనే ఏకంగా రూ.2వేల కోట్లు సంపాదించారని ఈడీ గుర్తించింది. దుబాయిలో ఉన్న ఆయన సహచరులు కూడా ఇదే దందా సాగిస్తున్నట్లు గుర్తించారు.