EC Extends Voter List Revision: సర్ గడువు వారం పొడిగింపు
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:57 AM
తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్...
9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతున్న ప్రక్రియ
ఫిబ్రవరి 14న ఓటర్ల తుది జాబితా విడుదల
న్యూఢిల్లీ, నవంబరు 30: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్(ఈసీ) ఒక వారం పొడిగించింది. చాలా తక్కువ వ్యవధి ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ఫారాలను ఈనెల(డిసెంబరు) 4వ తేదీ వరకు పంపిణీ చేయాల్సి ఉండగా, దాన్ని 11వ తేదీ వరకు పొడిగించినట్టు ఆదివారం ఒక ప్రకటనలో ఈసీ వెల్లడించింది. అలాగే, ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబరు 9న ప్రచురించాల్సి ఉండగా, 16న ప్రచురించనున్నట్టు తెలిపింది. ఓటర్ల తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయాల్సి ఉండగా, ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.
సర్ కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవీ..
అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీ్‌సగఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్‌లలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్‌లలో 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలోనూ 2026లోనే ఎన్నికలు జరుగనున్నప్పటికీ ఆ రాష్ట్రానికి విడిగా సర్ ప్రక్రియను ప్రకటించారు. పుట్టిన ప్రదేశాన్ని పరిశీలించి విదేశీ అక్రమ వలసదారులను ఏరివేయడమే సర్ ప్రధాన లక్ష్యం. కాగా, ఇంత తక్కువ గడువులో సర్ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని ఈసీ గ్రహించిందని కాంగ్రెస్ పేర్కొంది. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ విలేకరులతో మాట్లాడుతూ ఈసీ అహాన్ని వీడాలన్నారు. .