Share News

E20 Petrol : E20 పెట్రోల్ ఎంతో మెరుగైంది.. అనుమానాలు అక్కర్లేదన్న కేంద్రం

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:45 PM

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల రూ. లక్షన్నర కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. దాదాపు 245 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయ ఇంధన భద్రత లభించింది. దాదాపు 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గార తగ్గింపును సాధించింది. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం.

E20 Petrol :  E20 పెట్రోల్ ఎంతో మెరుగైంది.. అనుమానాలు అక్కర్లేదన్న కేంద్రం
E20 Petrol

న్యూఢిల్లీ, ఆగష్టు 12 : 20శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) ప్రవేశపెట్టడంపై వస్తున్న వ్యతిరేకతల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఈ చర్య కాలుష్యాన్ని తగ్గించడంలో, చమురు దిగుమతులపై డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుందని నొక్కి చెప్పింది. అంతేకాదు, మెరుగైన ఫార్ములేషన్ తోపాటు, రైడ్ నాణ్యతకు కూడా ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. E20 పెట్రోల్ కారణంగా మైలేజ్ గణనీయంగా తగ్గిందనే వాదనలపై, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.

ఇవాళ (మంగళవారం) విడుదల చేసిన వివరణాత్మక ప్రకటనలో, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ E20 ఇంధనానికి మారడం వల్ల ఒనగూరిన ప్రయోజనాల్ని విఫులంగా వివరించే ప్రయత్నం చేసింది. భారతదేశపు వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి ఇది దోహదకారి అని చెప్పింది .


చెరకు, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడకం విషయంలో GHG (గ్రీన్‌హౌస్ వాయువు) ఉద్గారాలు పెట్రోల్ కంటే వరుసగా 65శాతం , 50శాతం తక్కువగా ఉన్నాయని NITI ఆయోగ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను పొందిందని, రైతుల ఆదాయాలను పెంచడంతోపాటు, రైతు ఆత్మహత్యలను అరికట్టడంలో సహాయపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరో కీలక ప్రయోజనాన్ని హైలైట్ చేస్తూ, 2014-15 నుండి 2024-25 వరకు గత పదకొండు సంవత్సరాలలో, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల రూ. 1,44,087 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా జరిగింది. దాదాపు 245 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయ ఇంధన భద్రతను అందించింది. దాదాపు 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గార తగ్గింపును సాధించింది. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం. 20శాతం బ్లెండింగ్‌లో, ఈ ఒక్క సంవత్సరంలో రైతులకు చెల్లింపు రూ. 40,000 కోట్లు ఉంటుందని, ఇంకా ఫారెక్స్ ఆదా దాదాపు రూ. 43,000 కోట్లు ఉంటుందని చెప్పింది.

Updated Date - Aug 12 , 2025 | 07:56 PM