High Speed Rocket Sled Test: డీఆర్‌డీవో రాకెట్ స్లెడ్ టెస్ట్ విజయవంతం!
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:14 AM
అత్యంత వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానాల్లో, రాకెట్లలో ఉపయోగించే పరికరాలను పరీక్షించే హైస్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్’ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది....
యుద్ధ విమానం నుంచి పైలట్ తప్పించుకునేఎజెక్ట్ సీటు వ్యవస్థను పరీక్షించిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, డిసెంబరు 2: అత్యంత వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానాల్లో, రాకెట్లలో ఉపయోగించే పరికరాలను పరీక్షించే ‘హైస్పీడ్ రాకెట్-స్లెడ్ టెస్ట్’ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఛత్తీ్‌సగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (టీబీఆర్‌ఎల్)లో ఏర్పాటు చేసిన ‘రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టీఆర్‌ఎస్)’ కేంద్రంలో యుద్ధ విమాన పైలట్ ఎజెక్ట్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. విమానం ప్రమాదానికి గురైనప్పుడు లేదా నియంత్రణ కోల్పోయినప్పుడు పైలట్ ప్రాణాలు కోల్పోకుండా.. కేవలం సెకన్ల వ్యవధిలో సీటుతో సహా గాల్లోకి ఎగిరి, తర్వాత ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా నేలపైకి దిగేందుకు ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. ఈ సీటు దిగువన చిన్నపాటి రాకెట్ ఇంజన్లు ఉంటాయి. అవి క్షణాల్లోనే మండి సీటు గాల్లోకి ఎగురుతుంది. తేజస్ విమానాల కోసం డీఆర్‌డీవో ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిని ఇప్పటివరకు కదలకుండా ఉండే ఒక వేదిక మీది నుంచి ప్రయోగించి చూశారు. కానీ గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానంలో అది ఎలా పనిచేస్తుందన్నది పరీక్షించేందుకు ‘రాకెట్-స్లెడ్ టెస్ట్’ నిర్వహించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా తదితర కొన్ని దేశాలకు మాత్రమే ‘రాకెట్-స్లెడ్ టెస్ట్’ చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడా దేశాల జాబితాలో భారత్‌కూడా చేరింది. ఇప్పుడు ఆర్‌టీఆర్‌ఎస్ కేంద్రంలో తేజస్ ఫైటర్ ముందుభాగాన్ని రాకెట్‌కు అమర్చి, గంటకు 800 కిలోమీటర్ల వేగం వద్ద ‘పైలట్ ఎజెక్ట్ వ్యవస్థ’ను విజయవంతంగా పరీక్షించారు.