Share News

Rahul Gandhi: రాష్ట్రాలపై ప్రత్యక్ష దాడి

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:18 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీ నరేగా) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం రాష్ట్రాలపై ప్రత్యేక్ష దాడేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు.

Rahul Gandhi: రాష్ట్రాలపై ప్రత్యక్ష దాడి

  • నరేగా రద్దు.. రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే

  • జీ రామ్‌ జీతో పేదలకు నష్టం, కార్పొరేట్లకు లాభం: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీ నరేగా) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం రాష్ట్రాలపై ప్రత్యేక్ష దాడేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ప్రధాని మోదీ చర్య రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కునే కుట్రలో భాగమేనని ఆరోపించారు. శనివారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఖర్గే, రాహుల్‌గాంధీ మీడియాకు వివరించారు. రాహుల్‌ మాట్లాడుతూ.. నోట్ల రద్దు లాగే నరేగా పథకం రద్దు నిర్ణయం కూడా ఎటువంటి అధ్యయనం లేకుండా, కనీసం.. మంత్రివర్గాన్ని కూడా సంప్రదించకుండా మోదీ ఏకపక్షంగా తీసుకున్నదేనని ఆరోపించారు. ‘‘నరేగా కోట్లాది మందికి కనీస వేతనానికి హామీ ఇచ్చిన పథకం. దీని ద్వారా దేశంలోని కార్మికులకు కనీస స్థాయి వేతనం దక్కింది. ఇంతకంటే, దయనీయంగా, తక్కువ స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి లేకుండా రక్షణ కల్పించింది. కానీ, ఇప్పుడు ఆ రక్షణ వ్యవస్థను కూల్చేసే కుట్ర జరుగుతోంది. తద్వారా కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమే. రాష్ట్రాలకు చెందాల్సిన నిధులను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. నిర్ణయాధికారాన్ని లాక్కుంటుంది. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం. విఘాతం. దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసిన బలమైన సాధనంగా నరేగా నిలిచింది. గ్రామస్థాయిలో రాజకీయ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. నిధులను అందించడం నిర్ణయాధికారాన్ని పంచాయతీలకే ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకంపై దాడి చేయడం అంటే ముమ్మాటికీ గ్రామ పంచాయతీలను బలహీనపరచడమే’’ అని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.


పేదల ప్రయోజనాలను గుంజుకుని..

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలు, ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతులు (ఓబీసీ), పేద, సాధారణ వర్గాలు, మైనారిటీలకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్‌గాందీ అన్నారు. పేదలకు అందే ప్రయోజనాలను గుంజుకుని అదానీ, అంబానీ వంటి కొద్దిమంది కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చడమే మోదీ ప్రభుత్వం అసలు ఉద్దేశమన్నారు. నరేగా కూలిపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ‘‘నరేగా అనేది హక్కుల ఆధారిత పథకమే కాదు. ఇది ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆధారంగా నిలిచిన ఒక మూలస్తంభం. ఇటువంటి పథకాన్ని నిర్వీర్యం చేయడమంటే దేశ ప్రాథమిక నిర్మాణంపై, ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమే. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నరేగా పరిరక్షణ కోసం న్యాయ పోరాటం, ప్రజా ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్‌ పోరాటంతో కలిసి వస్తాయని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఖర్గే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌ జీకి వ్యతిరేకంగా జనవరి 5 నుంచి ‘నరేగా బచావో అభియాన్‌’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. వీబీ జీ రామ్‌ జీ బిల్లును వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్తంగా ’సడక్‌ నుంచి సంసద్‌‘ (రోడ్డు నుంచి పార్లమెంటు) వరకు పోరాటం చేస్తామని అన్నారు..


కూలీలకు డబ్బులు లేవా?

కార్పొరేట్లకు వేలకోట్లు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి కూలీల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవా? అని ఖర్గే ప్రశ్నించారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం వేతన భారం భరించేవని, కానీ.. దాన్ని 60:40 మార్చడం రాష్ట్రాలపై ఆర్థికభారం మోపేందుకేనని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ సభ్యులు అభిషేక్‌ మను సింఘ్వీ, వంశీచంద్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు సహా కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ముఖ్యమంత్రులు సిద్ధ రామయ్య, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేగా పథకాన్ని కాపాడి తీరుతామని సీడబ్ల్యూసీ సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన పార్టీ సీనియర్‌ నేతలు శివరాజ్‌ పాటిల్‌, ప్రకాశ్‌ జైస్వాల్‌లకు సంతాపం తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 06:20 AM