Share News

Dharmendra Pradhan: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌?

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:07 AM

భారతీయ జనతా పార్టీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. డిసెంబర్‌ 19న పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను...

Dharmendra Pradhan: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌?

  • పార్లమెంట్‌ సమావేశాలు ముగియగానే ప్రక్రియ వేగిరం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. డిసెంబర్‌ 19న పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగిరం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్‌లో ఉందని ఈ వర్గాలు తెలిపాయి. ఆదివారం నాటికి యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

యూపీలో డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు పార్టీ అఽఽధ్యక్షుడయ్యేందుకు అత్యధిక అవకాశాలున్నాయని, ఇతర ఓబీసీ నేతలు పంకజ్‌ చౌదరి, బీఎల్‌ వర్మ, సాధ్వీ నిరంజన తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా లక్నో వెళ్లిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి యూపీ బీజేపీ చీఫ్‌ పదవికి నామినేషన్‌ వేస్తారని సమాచారం. ఆదివారం యూపీ బీజేపీ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. కర్ణాటకలో లింగాయత్‌ నేత జగదీశ్‌ శెట్టర్‌, వక్కలిగ నేత సీటీ రవి పేర్లపై చర్చలు జరుగుతున్నాయి. ఏకాభిప్రాయం వస్తే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కూడా త్వరలో పూర్తవుతుందని, లేకపోతే పెండింగ్‌లో పెట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.


పరిశీలనలో కేంద్ర మంత్రుల పేర్లు!

బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ధర్మేంద్ర ప్రధాన్‌ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందని, బిహార్‌ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్లు కూడా చర్చలో ఉన్నప్పటికీ ప్రధాన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 13 , 2025 | 06:43 AM