Share News

Road Accidents on Yamuna Expressway: 13 మంది సజీవ దహనం

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:02 AM

ఉత్తరాదిన పొగమంచు.. నిండు ప్రాణాలను హరిస్తోంది. హరియాణాలో సోమవారం ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.....

Road Accidents on Yamuna Expressway: 13 మంది సజీవ దహనం

  • యమున ఎక్స్‌ప్రె్‌సవే మీద బస్సులు, కార్లు ఢీ

  • దట్టంగా అలుముకున్న పొగమంచు వల్లే..

  • దుర్ఘటనలో 43 మందికి గాయాలు

  • యూపీలో వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో మరో 12 మంది మృత్యువాత

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాలకు తీవ్ర అంతరాయం.. పలు సర్వీసులు రద్దు

మథుర, డిసెంబరు 16: ఉత్తరాదిన పొగమంచు.. నిండు ప్రాణాలను హరిస్తోంది. హరియాణాలో సోమవారం ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున యూపీలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. వీటిలో మొత్తంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 59 మంది గాయాల పాలయ్యారు. మంగళవారం ఉదయం నాలుగున్నర ప్రాంతంలో యమున ఎక్స్‌ప్రె్‌సవే మీద పొగమంచు కారణంగా.. 8 బస్సులు, 3 కార్లు ఢీకొన్నాయి. మంటలు అలుముకొని వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. 43 మంది గాయపడ్డారు. ఆగ్రా-నోయిడా మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని, దట్టమైన పొగమంచు అలుముకోవటంతో, ఎదుటనున్న వాహనాలు కనిపించక ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. యూపీలోనే బరాబంకీ జిల్లాలో ఓ వాహనాన్ని మరో వాహనం ఓవర్‌టేక్‌ చేస్తున్న క్రమంలో పొగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఉన్నావ్‌ జిల్లాలో ముందున్న రోడ్డు సరిగా కనిపించక ఓ వాహనం డివైడర్‌కు ఢీకొనటంతో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి మీరట్‌ జిల్లాలో పొగమంచు కారణంగా ఓ వాహనం బ్రిడ్జి మీది నుంచి నదిలో పడిపోయిన ఘటనలో ఇద్దరు మరణించారు. బస్తి జిల్లాలో ఉర్సుకు వెళ్తున్న యాత్రికులతో కూడిన బస్సు, ఓ లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించగా, 11 మంది గాయపడ్డారు. కాగా, పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, మధురై, పట్నా, చెన్నై, అహ్మదాబాద్‌లకు వెళ్లాల్సిన 14 విమానాలు రద్దయ్యాయి.

Updated Date - Dec 17 , 2025 | 04:02 AM