Share News

Dense Fog: ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:00 AM

ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. కొన్నిచోట్ల అడుగు దూరంలో ఏముందో కూడా కనిపించటంలేదు. దట్టమైన పొగమంచుకు తోడు వాయు కాలుష్యం అదుపు తప్పటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు...

Dense Fog: ఊపిరాడక ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి

16 రాష్ట్రాల్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు.. కొన్నిచోట్ల అడుగు దూరంలో ఉన్నది కూడా కనిపించని వైనం

రెడ్‌ అలర్ట్‌ జారీచేసిన వాతావరణ విభాగం

న్యూఢిల్లీ, డిసెంబరు 18: ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. కొన్నిచోట్ల అడుగు దూరంలో ఏముందో కూడా కనిపించటంలేదు. దట్టమైన పొగమంచుకు తోడు వాయు కాలుష్యం అదుపు తప్పటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాహనాలతోపాటు కాలి నడకన కూడా రోడ్లపైకి వెళ్లాలంటేనే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని భయపడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కరాళనృత్యం చేస్తోంది. గురువారం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400పాయింట్లకు పైనే నమోదైంది. అత్యధికంగా చిల్లా సరిహద్దు ప్రాంతంలో 490 పాయింట్లు రికార్డయింది. పొగమంచు కారణంగా ఉత్తరాదిలో రోడ్డు రవాణాతోపాటు రైలు, విమానసేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 16 రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌ మొత్తాన్ని రెడ్‌ అలర్ట్‌ జోన్‌గా గురువారం ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ జోన్‌ పరిధిలో పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. మరోవైపు పశ్చిమ మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. కేరళ, తమిళనాడు, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ గురువారం వెల్లడించింది.

రెండు ప్రమాదాల మధ్య ఢిల్లీ

ఢిల్లీ రెండు రకాల ప్రమాదాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు దట్టమైన పొగమంచుతో ప్రజల జీవితాల్లో చీకట్లు కమ్ముకోగా, మరోవైపు వాతావరణ కాలుష్యం ఊపిరాడకుండా చేస్తోంది. పొగమంచు, కాలుష్యంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అధికారులు కాలుష్య నియంత్రణ పత్రం (పీయూసీసీ)లేని పాత వాహనాలను నగరంలోకి రానివ్వటం లేదు. పీయూసీసీలేని వాహనాలకు రూ.20వేల జరిమానా విధిస్తున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం 27 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Updated Date - Dec 19 , 2025 | 04:00 AM